నందమూరి హీరో ఇక ఇంతేనా?
లెజెండ్ ఎన్టీఆర్ కుమారుడు నటసింహ బాలకృష్ణ తన 60 వ పుట్టినరోజును జరుపుకున్నారు. షష్ఠిపూర్తి తర్వాత బాలకృష్ణ ఇంకా సినిమాల్లో కొనసాగుతారా లేక గౌరవనీయమైన ఏపీ ముఖ్యమంత్రి పదవికి గాలం వేస్తారా? ఆయన ఆ పదవికి ఇంకా ఎంత దూరంలో ఉన్నారు? అంటూ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. నందమూరి వంశం ఎప్పుడూ పదవులకు.. అధికారంలో ఉండేందుకు గౌరవం ఇస్తారన్నది లోకానికి తెలిసిన నిజం. కానీ దీనికి విరుద్ధంగా తనకు అలాంటి ఆలోచన ఉండదని షష్ఠిపూర్తి ఇంటర్వ్యూల్లో బాలకృష్ణ చాలాసార్లు కుండబద్ధలు కొట్టారు. పదవి ఆశ లేకపోవడం వల్లనే తాను ఇంకా ఇలా కొనసాగుతున్నానని నర్మగర్భంగా అన్నారు.
అయితే తాను ఎన్‌టిఆర్‌కు సిసలైన వారసుడినని బాలకృష్ణ ఎప్పుడూ ప్రగల్భాలు పలుకుతుంటారు. కానీ ఆయన రాజకీయాల పరంగా మాత్రం ఇలాంటి అసంబద్ధ వాదన చేయలేరు. ఎందుకంటే అతని బావ చంద్ర బాబు నాయుడు టీడీపీ నాయకత్వాన్ని అతడు ఎప్పటికీ వ్యతిరేకించలేని ధైన్యంలో ఉన్నారు. బాలయ్య కుమారుడు నారా లోకేష్ అతని అల్లుడు కాబట్టి ఏపీకి అతడే తదుపరి ముఖ్యమంత్రి అనే ధీమాలో ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఆ సీన్ ఉందా? అంటే .. లేనేలేదు.. అతడు పప్పూ! అంటూ అధికారపక్షం విపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి.
చంద్ర బాబు తరువాత లోకేశ్ పార్టీ పగ్గాలు చేపట్టినా పార్టీ ముందుకెళుతుందా? అన్నది ఇప్పటికి సందిగ్ధమే. అల్లుడు సీఎం అవుతారా లేదా? అన్న సందిగ్ధంతో పాటు ఇప్పుడు బాలకృష్ణకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది. బాలకృష్ణ మంత్రి కావాలని కలలు కన్నా వియ్యంకుడు చంద్ర బాబు అది నెరవేరనివ్వడు. చంద్ర బాబు బాలకృష్ణను ఇంతగా ప్రేమిస్తే, ఆయనను చాలా కాలం క్రితం మంత్రిని చేసేవారు కదా! అన్నది నందమూరి అభిమానుల ఆవేదన. ఆయన మంత్రి అవ్వరు.. అలాగే ముఖ్యమంత్రి అవ్వరు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతారు. అది కూడా మరోసారి గెలిస్తే.
కానీ బాలకృష్ణ అభిమానుల వెర్షన్ వేరే. తమ ఫేవరెట్ హీరోని ముఖ్యమంత్రిగా చూడాలని కలలు కంటున్నారు. కొద్దిమంది అభిమానులు ఆయనను `భవిష్యత్ సీఎం బాలకృష్ణ` అని బలంగా కోరుకున్నారు. అయితే పలు సందర్భాల్లో రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలకృష్ణ ఏ రాజకీయ పదవి గురించి మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవడం వెనక ఆయనలో ఏదో తెలీని భయం నాయకత్వ లోపమే కారణమని కొందరు నమ్ముతున్నారు. బాలకృష్ణ కేవలం చంద్ర బాబు చేతిలో రిమోట్ మాత్రమేనని కొందరు ఫ్యాన్స్ వ్యాఖ్యానించారు. కాబట్టి బాలకృష్ణ ముఖ్యమంత్రి కావడం అన్నది అసాధ్యమైన ఫీట్. భవిష్యత్ లో అందుకు ఆస్కారమే లేదని విశ్లేషిస్తున్నారు. దీనిని కన్ఫామ్ చేస్తూ చంద్రబాబు మాత్రమే నాయకుడు అనే విధంగా బాలయ్య ఓ ఇంటర్వ్యూలో అనడం ఆశ్చర్యపరిచింది. తండ్రి నుంచి అధికారాన్ని లాక్కున్న బావ నుంచి తాను లాక్కునే ఆలోచనతో లేనని పరోక్షంగా చెప్పనట్టయ్యింది.
ఇక ఏపీలో వైకాపా అధినాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడలు చూస్తుంటే ఇప్పట్లో తేదేపా కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చినా, చంద్ర బాబు మునుపటిలా బాలయ్యను పట్టంచుకుంటారా? అన్నది సందేహమేనని కొందరు క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. ఆ క్రమంలోనే నందమూరి వంశం నుంచి అత్యంత ప్రభావవంతమైన హీరో ఎన్టీఆర్ ని తిరిగి తెరపైకి తెచ్చేందుకు కొడాలి నాని వంటి నాయకులు ప్రయత్నిస్తున్నారన్న విశ్లేషణ ఇప్పటికే సాగుతోంది. బాలయ్య సీఎం కారు. లోకేష్ సీఎం కాలేడు. కేవలం ఆ అవకాశం ఇకపై ఎన్టీఆర్ కి మాత్రమే ఉంది. తాత అంశతో జన్మించిన తారక్ మాత్రమే ఆ అధికారం చేపట్టగలడు అన్న విశ్లేషణ బలంగా సాగుతోంది.