బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్: ఇండో-చైనా ఘర్షణలపై క్రేజీ మూవీ

బార్డ‌ర్ వార్ నేప‌థ్యం అంటేనే అంద‌రిలో ఒక‌టే ఆస‌క్తి. ఇలాంటి సినిమాల‌కు పాన్ ఇండియా అప్పీల్ ఉంటుంది. అందుకే అలాంటి క‌థ‌ల్ని సినిమాలుగా తీసే ఛాన్స్ ద‌క్కితే తెలివైన ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.. హీరోలు అస్స‌లు విడిచిపెట్ట‌రు. అయితే అంద‌రూ మెచ్చేలా ఆద్యంతం ఉత్కంఠ రేపేలా తెర‌కెక్కించే ద‌మ్ము చాలా అవ‌స‌రం.

ఇటీవ‌ల గాల్వాన్ లోయ‌లో ఇండో- చైనా ఘ‌ర్ష‌ణ‌ దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్. బార్డ‌ర్ లో చైనా తీరుతెన్నులు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి. భారతదేశం, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత సైన్యం చైనాకి చెందిన పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీ (PLA)తో ఘ‌ర్ష‌ణ ప‌డింది. ఒక‌రిపై ఒక‌రు గెరిల్లా త‌ర‌హా ఫైట్ కి త‌ల‌ప‌డ‌డం .. ఈ హింసాత్మ‌క‌ గొడ‌వ‌లో 21 మంది ధైర్యవంతులైన భార‌తీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించడం తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ అనంత‌రం ఇండియ‌న్ ఆర్మీ హై అలెర్ట్ అయ్యింది. చైనా కుయుక్తుల్ని తిప్పి కొట్టేందుకు భార‌త ఆర్మీ అన్ని ఏర్పాట్ల‌తో సంసిద్ధంగా ఉంది.

తాజాగా ఈ ఘ‌ర్ష‌ణ‌పై సినిమా తెర‌కెక్కించేందుకు ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్రముఖ మలయాళ నటుడు-దర్శకుడు మేజర్ రవి భారత-చైనా సరిహద్దు వివాదంపై `బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్` పేరుతో ఒక చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాన‌ని ప్ర‌క‌టించారు. ఈ క్రేజీ చిత్రంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ప్రారంభంలో కిక్‌స్టార్ట్ అవుతుంది. మేజర్ రవి వార్ డ్రామాల‌కు ప్ర‌సిద్ధి. ఇంత‌కుముందు 1971: బియాండ్ బోర్డర్స్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించారు. మోహ‌న్ లాల్ ఆ చిత్రంలో హీరో. 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించిన చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడికి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి.