మెగాస్టార్ 152లో రామ్ చ‌ర‌ణ్ రోల్ లీక్

ఇది మెగా పొలిటిక‌ల్ మ‌ల్టీస్టార‌ర్‌?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా 152వ సినిమా విజ‌య‌ద‌శ‌మిని పుర‌స్క‌రించుకుని పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి కొరటాల శివ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. చ‌ర‌ణ్ ఇందులో ఓ కీల‌క పాత్ర పోషించ‌నున్నారు. న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌నున్నారు. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తారు? రామ్ చ‌ర‌ణ్ పాత్ర ఎలా ఉంటుంది? అన్న దానిపై తాజాగా స‌మాచారం అందింది.

వాస్త‌వానికి ఇందులో మెగాస్టార్ చిరంజీవిని రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో ఎలివేట్ చేయాల‌ని కొర‌టాల స్క్రిప్టును త‌యారు చేసుకున్నారు. ఇదో సోషియో పొలిటిక‌ల్ డ్రామా స్క్రిప్టు. ఇందులో ఒక కోణంలో జెంటిల్మ‌న్ గాను.. మ‌రో షేడ్ లో యువ‌కుడిగానూ క‌నిపించాల్సి ఉంది. కానీ చివ‌రి నిమిషంలో స్క్రిప్టు మారింది. ఇందులో యువ‌కుడైన చిరు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గా ఉండ‌నుంది. అలాగే చిరంజీవి ఈ సోషియో చిత్రంలో మ‌రోసారి అద్భుత‌మైన ఆహార్యం కామెడీ టైమింగుతో మెప్పించ‌నున్నార‌ట‌. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ నిర్మిస్తోంది. చ‌ర‌ణ్ ఓ నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు.

చిరు-ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్
ఇదివ‌ర‌కూ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించేందుకు సిద్ధంగా ఉంటే త‌నతో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ లో న‌టిస్తాన‌ని చిరంజీవి అన్నారు. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ తో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించేస్తున్నారు కాబ‌ట్టి.. ప‌వ‌న్‌తోనూ మ‌రో మ‌ల్టీస్టార‌ర్ సెట్స్ కెళ్లే వీలుంద‌ని అభిమానులు అంచ‌నా వేస్తున్నారు. చిరు- ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్‌ను రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తారు.