ప్రస్తుత సంక్షోభం నుంచి టాలీవుడ్ బయటపడేదెలా? లాక్ డౌన్లు ఎత్తేసినా కానీ థియేటర్లు తెరవరు.. మాల్స్ తెరుచుకోవు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందే ప్రకటించేసింది. జనసమూహాలకు ఆస్కారం ఉన్న వేటికీ అనుమతులు లభించవని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు. అంతేకాదు ఇప్పటివరకూ షూటింగులకు అనుమతులు లభించలేదు. కేవలం నిర్మాణానంతర పనులకు మాత్రం తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
అయితే ఇది అత్యయిక పరిస్థితి అన్నది అందరికీ తెలిసిందే. ఇలాంటి సన్నివేశం ఒకటి తమ జీవితాల్లోకి ప్రవేశిస్తుందని సినీపరిశ్రమ పెద్దలెవరూ ఏనాడూ గ్రహించి ఉండరు. అసలు ప్రపంచమే ఊహించని విపత్తు ఇది. అయితే కరోనా మహమ్మారీ ఎన్నో గొప్ప పాఠాల్ని మానవాళికి నేర్పించింది. ముఖ్యంగా వినోద పరిశ్రమలకు ఎంతో నేర్పిస్తోంది. సినిమా వీక్షణ భవిష్యత్ అంతా కొత్తగా ఉండనుందన్న సంకేతాలు ఇప్పటికే అందాయి. ఇది కొత్త ఆవిష్కరణలకు తెర తీస్తోంది. ఇప్పటికిప్పుడు డిజిటల్ – ఓటీటీకి .. బుల్లితెరకు అమాంతం డిమాండ్ పెరిగింది.
వీటన్నిటితో పాటు.. సినీపెద్దలు ఏ నలుగురు కలుసుకున్నా.. టాలీవుడ్ లో రానున్న ఓ కొత్త పరిణామం గురించి చర్చించుకుంటున్నారు. అదే టాలీవుడ్ షిఫ్టింగ్ అనే టాపిక్. తెలుగు చిత్రసీమ హైదరాబాద్ లో ఉన్నా.. బీచ్ సొగసుల వైజాగ్ లోనూ మరో పరిశ్రమను పాదుకొల్పాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు మరోసారి ఈ టాపిక్ పై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీపెద్దలు చర్చించనున్నారని ప్రచారమవుతోంది. ఏపీలోనూ ఓ కొత్త పరిశ్రమ ఉంటే ఇలాంటి కష్టకాలంలో దానివల్ల కొంత మేలు జరుగుతుందన్న టాపిక్ కూడా చర్చకు వచ్చిందట. అయితే అలాంటి చర్చకు కారణం లేకపోలేదు.
ఓవైపు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని పరిశ్రమలకు వెసులుబాటు కల్పించినా .. వినోదపరిశ్రమ విషయంలో కనికరించడం లేదు ఎందుకనో. సరిగ్గా ఇదే పరిణామం సినీపెద్దలకు కోపం తెప్పించిందట. ఇటీవల పలుమార్లు తలసాని సహా కేసీఆర్ కి సినీపరిశ్రమ తరపున విన్నపం వినిపించినా కానీ అదేదీ పట్టించుకోలేదు ఇక్కడ. ఇక సినీపరిశ్రమకు ఇది చేస్తాం అది చేస్తాం! అనడమే కానీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ చేసింది గుండు సున్నా. ఈ పరిణామం రాను రాను సినీపెద్దల్లో అసహనానికి దారి తీస్తోందట. ప్రతిసారీ తలసాని సినిమావాళ్లతో మీటింగులు అంటూ హడావుడి చేయడం ఇది చేద్దాం అది చేద్దాం అనడమే కానీ ఏదీ ఆచరణలో మాత్రం చేసి చూపించడం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికి మన పెద్దలంతా గ్రహించారట.
ఇక షూటింగుల విషయంలో ఇప్పటికే ఏపీలో సీఎం జగన్ అనుమతులు ఇచ్చారని .. దీంతో ప్రస్తుతం పెండింగులో ఉన్న షూటింగుల్ని ఏపీలో పూర్తి చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారని వార్తలొచ్చాయి. అంటే జగన్ వద్ద ఉన్న ఫ్లెక్సిబిలిటీ కేసీఆర్ వద్ద లేదనే దీనర్థం. ఐటీ-రియల్ ఎస్టేట్- ఇన్ ఫ్రా వంటి ఇతర పరిశ్రమలపై ఉన్న శ్రద్ధ ఏనాడూ సినీపరిశ్రమపై గులాబీ దళపతిలో కనిపించలేదన్న నగ్న సత్యాన్ని మరోసారి సినిమావోళ్లు తెలుసుకున్నారన్న మాటా వినిపిస్తోంది. అందుకే వీలైనంత త్వరగా పరిశ్రమను వైజాగ్ కి షిఫ్ట్ చేయాలన్న ప్రతిపాదనా తెరపైకి వచ్చిందట. ఈ విషయంపై మరోసారి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో చర్చించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు సినీపెద్దల నుంచి చిరుకి బోలెడంత మద్ధతు ఉంది కాబట్టి కాగల కార్యం కష్టమేమీ కాదని ఇన్ సైడ్ టాక్ బలంగానే వినిపిస్తోంది. అసలు కరోనా లాక్ డౌన్లతో పని లేకుండానే వైజాగ్ టాలీవుడ్ పై అంతా ఆసక్తిగానే ఉన్నారన్న మాటా నేటి పరిశ్రమ పెద్దల మీటింగులో చర్చకొచ్చిందట.
సీఎం జగన్ తో భేటిలో ముఖ్యంగా సినిమా షూటింగ్ లకు అనుమతి.. నంది అవార్డుల విషయాన్ని సినీ పెద్దలు దృష్టికి తీసుకువస్తారని తెలుస్తోంది. సినిమా హాళ్ల ఓపెనింగ్ సినీ కార్మికులు పరిశ్రమలకు రాయితీలుప్రోత్సాహకాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ వారంలోనే జరిగే చిరంజీవి-జగన్ భేటి జరగనుందట.