గాడ్సే ఎపిసోడ్ తో మెగాబ్ర‌ద‌ర్ ఇమేజ్ పెరిగిందా?

మంచో చెడో.. ఏ మార్గాన్ని ఎంచుకున్నా పాపులారిటీ వ‌స్తుంది ఈరోజుల్లో. ట్వీట్లు.. ఇన్ స్టా.. ఫేస్ బుక్ పోస్టులు.. అక్క‌డ పోరాటాలు వ‌గైరా వ‌గైరా మ‌నిషి ఇమేజ్ ని పెంచుతున్నాయి. చెడు చేస్తే చెడు అని చ‌ర్చిస్తూనే అందులో కూడా పాజిటివిటీ వెతికే స‌మాజం మ‌న‌ది. ఇక మంచి చేస్తే ఆకాశానికెత్తేస్తుంది. మొత్తానికి రీజ‌న్ ఏదైనా కానీ.. గాడ్సే ఎపిసోడ్ తో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఇమేజ్ పెరిగిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఏదో జ‌న‌సేన కార్య‌క‌ర్త అనో లేదా అదిరింది – టీవీ హోస్ట్ అనో అనుకుంటే అస‌లు అంత మైలేజ్ వ‌చ్చేదే కాదు. ఆయ‌న గాడ్సేను స‌మ‌ర్థిస్తూ గాంధీజీని అన‌డ‌మే అస‌లు సిస‌లు మైలేజ్ తెచ్చింది. ఆయ‌న‌పై ఇప్పుడు వ‌రుస పెట్టి 24/7 వార్తా చానెళ్ల‌లో డిబేట్లు.. కామెంట్లు.. ఫైటింగులు చూస్తుంటే అబ్బో గాడ్సే కంటే నాగ‌బాబే గొప్ప దేశ‌భ‌క్తి ప‌రుడా? అని సందేహం క‌ల‌గ‌క మాన‌దు. ఇక‌పోతే ప్ర‌ముఖ మీడియాల‌న్నీ నాగ‌బాబును విధివంచిత‌ను చేస్తూ బోలెడంత టీఆర్పీ ఆటాడాయి.

ఓ ప్ర‌ముఖ మీడియా అయితే నాలుగు పేజీల చాట భార‌త‌మే రాసుకొచ్చింది. దాని సారాంశం ప‌రిశీలిస్తే.. గాడ్సే దేశభక్తుడేన‌ని నాగ‌బాబు ఎలా తీర్పు చెప్పారో? తేలాల్సిందే. అతను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాడా? సాధారణ పౌరులు, అహింసా ఉద్యమ సైనికులు జైలుకు వెళ్ళినప్పుడు, అతను వారిలో ఒకడిగా ఉన్నాడా? అతను హింసాత్మక పద్ధతులను నమ్ముతున్నందున, అతను జైలుకు వెళ్ళలేదని అనుకున్నా.. కానీ అత‌డి బ‌దులుగా కొంద‌రు బ్రిటిష్ గవర్నర్ లేదా కలెక్టర్ లేదా మేజిస్ట్రేట్ మీద కాల్పులు జరిపి జైలుకెళ్లారు. బ‌హుశా గాడ్సే మాత్రం వారిలో ఎవరినీ కాల్చలేదు. కానీ బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారిపోయేలా చేసిన గొప్ప స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడైన గాంధీజీని కాల్చాడు.

గాడ్సేని మీరు దేశభక్తుడిగా కనుగొంటే, గాడ్సే మరొక దేశభక్తుడిని చంపేంత గొప్ప దేశ‌భ‌క్తుడా? అన్న‌ది తేలాల్సి ఉంది. దేశ విభజనకు కారణమైన జిన్నాను లేదా మరే ఇతర ముస్లిం లీగ్ నాయకుడిని గాడ్సే చంపినట్లయితే, మీరు గోడ్సేను దేశభక్తుడిగా ముద్రవేసినందుకు ఆశ్చర్యపోం! అంటూ ఓ రేంజులోనే క్లాస్ తీస్కున్నారు.

గాడ్సే ఒక హిందూ కార్యకర్త, సామాజిక-మత సంస్థలైన ఆర్ఎస్ఎస్ భావజాలంతో హిందూ మహాసభలలో పనిచేశారు. హిందుత్వ బ్రాండ్ అనుచరుడిగా మీరు అతన్ని గొప్ప హిందువు అని ఉంటే పెద్ద‌గా షాక‌య్యేవాళ్లం కాం. కానీ మీరు అతన్ని నిజమైన దేశభక్తుడు అని పిలిచారు. మీరు గాడ్సేను ఆరాధించవచ్చు. దాంతో ఏ సమస్యా లేదు. దయచేసి మీరు అనుభవిస్తున్న ప్రజాస్వామ్యం మీ హీరో గాడ్సే చేత దారుణంగా చంపబడిన గాంధీ నేతృత్వంలోని అనేక స్వాతంత్య్ర‌ సమరయోధుల క‌ఠోర‌శ్రమ ఫలం అని గుర్తుంచుకోండి..! అంటూ నాగ‌బాబుపై క్లాస్ తీస్కుంది మీడియా. పాజిటివో నెగెటివో కార‌ణం ఏదైనా కానీ నాగ‌బాబు ఇమేజ్ మాత్రం ప‌దింత‌లైంది ఇప్పుడు.