లాక్‌డౌన్ ఎఫెక్ట్‌: మ‌రో టాలీవుడ్ బిగ్ షాట్‌కి గుండెపోటు

సినీ ప్ర‌ముఖుల గుండె నొప్పికి కార‌ణం?

ప్రముఖ నైజాం పంపిణీదారుడు- నిర్మాత‌, ఏషియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్ నిన్న రాత్రి గుండెపోటుతో అపోలో ఆస్ప‌త్రిలో చేరారు. ఆయ‌న‌ను తెల్లవారుజామున ఒంటిగంట‌కు కుటుంబ స‌భ్యులు అపోలోలో చేర్పించార‌ని తెలుస్తోంది. ఆయ‌న గుండె ధమనులలో ఒకదానిలో బ్లాక్ ఉంది. రక్త ప్రవాహాన్ని పునరుద్ధరించడానికి వైద్యులు స్టెంట్ వేశార‌ని తెలిసింది.

ఇటీవ‌ల వ‌రుస‌గా ఇది రెండో ఘ‌ట‌న‌. టాలీవుడ్ లో వ‌రుస‌గా గుండె నొప్పి బాధితులు పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మొన్న‌టికి మొన్న ఆర్.ఆర్.ఆర్ నిర్మాత‌ డీవీవీ దాన‌య్య‌కు గుండె నొప్పి అన్న వార్త‌లు .. ఇంతలోనే ఏషియ‌న్ సునీల్ నారంగ్ కి గుండెనొప్పి వ‌చ్చింద‌న్న వార్త టాలీవుడ్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపింది.

లాక్ డౌన్ కారణంగా థియేటర్లను మూసివేయడం వ్యాపారం స‌జావుగా సాగ‌క‌పోవ‌డంతో నారంగ్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల‌ సునీల్ నారంగ్ వ్యాపారాలు బాగా దెబ్బ తిన్నాయి. ఆయ‌న‌కు ఘ‌న‌నీయ‌మైన ‌ సంఖ్యలో ప్రాజెక్టులను క్యూలో పెట్టారు. పైగా మల్టీప్లెక్స్ చైన్ ఏషియ‌న్ సినిమాస్ .. AMB సినిమాస్ గురించి తెలిసిన‌దే. ఈ వ్యాపారాల‌న్నీ ప్ర‌స్తుతం స్థ‌బ్ధుగా ఉన్నాయి. ఇది కూడా ఆయ‌న‌పై ఒత్తిడిని పెంచింద‌నే భావించ‌వ‌చ్చు. ఇక దాన‌య్య సైతం ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీపై భారీ పెట్టుబ‌డుల్ని వెద‌జ‌ల్లారు. ఇది ఆయ‌న‌పైనా ఒత్తిడిని పెంచింద‌నే చెప్పాలి.

గ‌త నాలుగు నెల‌లుగా షూటింగుల్లేవ్‌.. థియేట‌ర్లు తెరిచింది లేదు. ఎప్ప‌టికి ప‌రిస్థితి తిరిగి స‌క్ర‌మం అవుతుందో తెలీని ప‌రిస్థితి. లాక్ డౌన్ అంద‌రు నిర్మాతల్లోనూ టెన్ష‌న్ పెంచింది. సినిమా వ్యాపారానికి నిజంగానే క‌ష్ట కాలం దాపురించింద‌నే చెప్పాలి. ఓవైపు అప్పులు ఫైనాన్సులు ఒత్తిళ్లు పెంచుతుంటాయి. వాటిని స‌కాలంలో చెల్లించ‌క‌పోతే కుటుంబాలే రోడ్డున ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది. కరోనా కేసుల పెరుగుదల అంత‌కంత‌కు టెన్ష‌న్ పెంచుతోందే కానీ త‌గ్గించే ప్ర‌సక్తే క‌నిపించ‌లేదు. దేశవ్యాప్తంగా పెరుగుతున్నందున, సమీప భవిష్యత్తులో థియేటర్లు తిరిగి తెరవకపోవచ్చు.