మళ్ళీ ఆంధ్రపదేశ్‌లో అధికారం సాధ్యమేనా.? అని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు జుట్టుపీక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా స్వయంకృతాపరాధమే. 2014 ఎన్నికల్లో అధికారం దక్కిన తర్వాత, పార్టీని బాగు చేసుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టేసి, అడ్డగోలు రాజకీయాలు చేశారు. అదే టీడీపీకి శాపంగా మారింది.
పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి ఎంతమంది ఎమ్మెల్యేలను చంద్రబాబు వైసీపీ నుంచి లాగేశారో, ఆ సంఖ్యలో మాత్రమే 2019 ఎన్నికల్లో టీడీపీకి ఎమ్మెల్యేలు దక్కడం ముమ్మాటికీ విచిత్రమే. 2024 ఎన్నికల నాటికి టీడీపీ పరిస్థితి ఎలా వుండబోతోందన్న ఆలోచనే చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందన్నది నిర్వివాదాంశం.
కానీ, అధికారంలోకి వచ్చి తీరాలి.. లేదంటే, టీడీపీకి శాశ్వత సమాధి.. అనే భావన చంద్రబాబులోనూ వుంది. ఇంతలోనే, జూనియర్ ఎన్టీయార్ అభిమానుల నుంచి కొత్త తలనొప్పి చంద్రబాబుకి మొదలైంది. రాజకీయాల పట్ల జూనియర్ ఎన్టీయార్ ఆసక్తి చూపకపోయినా, ఆయన అభిమానులు మాత్రం ఒప్పుకోవడంలేదు.. రాజకీయాల్లోకి వచ్చి, టీడీపీ పగ్గాలు చేపట్టాల్సిందేనంటూ తమ అభిమాన నటుడిపై ఒత్తిడి తెస్తున్నారు.
తమ అభిమాన నటుడి జెండాలతో టీడీపీ అధినేతకు తలపొప్పులు తెస్తున్నారు. గతంలో అయితే, బాలకృష్ణ ద్వారా జూనియర్ ఎన్టీయార్‌కి చెక్ పెట్టించేవారు చంద్రబాబు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. జూనియర్ ఎన్టీయార్ చాలా ఎదిగిపోయాడు. బాలయ్య గ్రాఫ్ అలా అలా తగ్గిపోతూ వస్తోంది. బాలయ్య చేష్టలూ టీడీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి.
దాంతో, జూనియర్ ఎన్టీయార్ మీదకి ఎవర్ని ప్రయోగించాలో చంద్రబాబుకి అర్థం కావడంలేదు. ఇలాగే వదిలేస్తే, ముందు ముందు రాజకీయంగా జూనియర్ ఎన్టీయార్ అభిమానుల నుంచి ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకోవడం చంద్రబాబుకి మరింత కష్టమవుతుంది. అందుకే, తీవ్రంగా ఆలోచించి కఠిన నిర్ణయం చంద్రబాబు తీసుకోబోతున్నారట. అదేంటన్నది ముందు ముందు తెలుస్తుంది.