‘స్పైడ‌ర్ మ్యాన్’ సృష్టిక‌ర్త స్టాన్ లీ మృతి

ఈ తరంలో స్పెడర్ మ్యాన్ ని, హల్క్, ద ఫెంటాస్టిక్ ఫోర్ పాత్రలను తెలియనివాళ్లు ఎవరూ ఉండరు. ముఖ్యంగా పిల్లలకు ఆ పాత్రలంటే ప్రాణం. మరి ఆ పాత్రలకు ప్రాణం పోసింది ఎవరూ అంటే స్టాన్ లీ. హాలీవుడ్ లో పేరున్న ర‌చ‌యిత‌, ఎడిట‌ర్‌, ప‌బ్లిష‌ర్‌ స్టాన్ లీ (95) క‌న్నుమూసారు. లాస్ ఏంజిల్స్‌లోని సిడార్స్ సినాయ్ మెడిక‌ల్ సెంట‌ర్‌లో స్టాన్ లీ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె వెల్లడించారు.

హాలీవుడ్‌లో ఫాద‌ర్ ఆఫ్ పాప్ క‌ల్చ‌ర్‌గా గుర్తింపు ఉన్న స్టాన్ లీ మార్వెల్ కామిక్స్ కోసం 1961లో తొలిసారి ‘ద ఫెంటాస్టిక్ ఫోర్’ క్యారెక్ట‌ర్ల‌ను క్రియేట్ చేసారు. ఆ త‌ర్వాత స్పైడ‌ర్ మ్యాన్‌, ద ఇంక్రెడిబుల్ హ‌ల్క్, ఎక్స్‌-మెన్‌, థోర్‌, ఐర‌న్ మ్యాన్‌, బ్లాక్ ప్యాంథ‌ర్ లాంటి సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌నూ సృష్టించాడు. గ‌త ఏడాది స్టాన్ లీ భార్య అనారోగ్యంతో క‌న్నుమూసారు.

టాప్ ఆర్టిస్టులు జాక్ కిర్బీ, స్టీవ్ డిట్కోతో స్టాన్ లీ ప‌నిచేశారు. కామిక్ క్యారెక్ట‌ర్ల‌ను సృష్టించ‌డంతో స్టాన్ కీల‌క పాత్ర పోషించాడు. సూప‌ర్ హీరో క్యారెక్ట‌ర్ల‌కు అన్ని హంగుల‌ను అద్దింది ఈయ‌నే.

ఆయన మృతికి తెలుగు రాజ్యం సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తోంది.