నల్గొండ కు చెందిన చిందకంది మల్లేశం జీవితగాధ ఆధారంగా కూడా ఓ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన మల్లేశం తన తల్లి చీరలు నేయడానికి ఆసు పోయడానికి పడుతున్న కష్టం చూసి అతనే ఏడేళ్ల పాటు శ్రమించి ఆసు యంత్రం తయారు చేసి.. ఉత్తమ గ్రామీణ ఆవిష్కర్తగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు సొంతం చేసుకున్నాడు మల్లేశం. అంతేకాక భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రధానం చేసింది.
ఇప్పుడు మల్లేశం జీవితగాధ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. అంతేకాక.. చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు.
ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. సినీ తారలు, క్రీడాకారుల జీవితగాధల ఆధారంగా ఇప్పటికే కొన్ని బయోపిక్‌లు వచ్చాయి.. మరికొన్ని షూటింగ్ జరుపుకుంటున్నాయి. వీటితో పాటు తాజాగా రాజకీయ నాయకుల జీవితగాధలపై కూడా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవితగాధ ఆధారంగా ‘‘తెలంగాణ దేవుడు’’ ‘‘ఉద్యమ సింహం’’ అని రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జీవితగాధ ఆధారంగా ‘‘చంద్రోదయం’’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యే వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్లు, టీజర్లు విడుదలయ్యాయి.