దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరెడ్డి పాదయాత్రను యాత్ర టైటిల్తో యంగ్ డైరెక్టర్ మహి.వి రాఘవ తెరకెక్కించి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్ పాత్రలో మలయాళీ నటుడు మోహన్ లాల్ ఒదిగిపోయారు. పాత్రలో ఆత్మను పట్టుకుని నటించారు. ఆ పాత్ర మోహన్ లాల్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చింది. ఈ సినిమాలో కేవలం పాద యాత్రను మాత్రమే హైలైట్ చేసారు. రిలీజ్ అనంతరం జగన్ సదరు దర్శకుడ్ని వ్యక్తిగతంగా ఇంటికి పిలిపించి సన్మానించారు. తాజాగా నయా దర్శకుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీర్ పై కన్నేసాడు.
జగన్ చేసిన సుధీర్ఘ పాద యాత్ర, కాంగ్రెస్ పార్టీ కారణంగా మొదలైన ప్రతికూల పరిస్థితులు, వ్యక్తిగతంగా ఎదుర్కున్న సమస్యలతో పాటు, సిఎం ఆయ్యే వరకూ ఆయన పడిన కష్టాలను వెండి తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. వాస్తవానికి యాత్ర-2 గా తెరకెక్కించాలని ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది. తాజాగా దానిపై మరిన్ని వివరాలు రివీల్ చేసాడు. వైఎస్ కథను సినిమాగా చేయాలంటే కష్టపడాలి గానీ, జగన్ కథకు అంత కష్టం అవసరం లేదు. ఆయన జీవితంలోనే సినిమాకు కావాల్సిన బోలెడన్ని కమర్శియల్ అంశాలున్నాయి. హీరోయిజం, కష్టాలు, పోరాటం వంటింది ఆయనకు చిన్న నాటి నుంచి అలవడిన లక్షణం.అందుకోసం ఆయన కథ గురించి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన పనిలేదు. అయితే ఈ కథను తెరకెక్కించడానికి జగన్ అన్న మాత్రం ఒకే చెప్పాలి. ఆయన గ్రీన్ సిగ్నెల్ ఇస్తే 2022 గానీ, 2023 లోగానీ ప్రారంభిస్తాను అన్నారు. అంటే సరిగ్గా ఎన్నికలకు ముందు అన్న మాట. ప్రచారానికి అలాంటి సమయంలో బయోపిక్ గాచేస్తే మరింత కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.