అమెజాన్ లో మహర్షి థీమ్ బుక్.. మహేష్ పబ్లిసిటీ
సూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి` విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో సామాజిక సందేశం అభిమానులకు కనెక్టయ్యింది. వ్యవసాయం.. రైతాంగంలో సమస్యల్ని స్పర్శిస్తూ దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న కాన్సెప్టుకు ప్రశంసలు దక్కాయి. ఇలాంటి దిమాకున్న కాన్సెప్టుని ఎంకరేజ్ చేసిన నిర్మాతలు దిల్ రాజు- అశ్వనిదత్- పీవీపీని జనం మెచ్చుకోలుగా చూశారు. అదంతా గతం అనుకుంటే వర్తమానంలో మహర్షి థీమ్ ని ప్రతిబింబిస్తూ ఓ పుస్తకం మార్కెట్లోరి రిలీజైంది. ఈ పుస్తకం పేరు `సెల్ఫీ ఆఫ్ సక్సెస్`. ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం ఈ పుస్తకానికి రచయిత.
ప్రస్తుతం అమెజాన్ లో పుస్తక ప్రతుల్ని విక్రయిస్తున్నారు. దీనికి సూపర్ స్టార్ మహేష్ సైతం ప్రచార సాయం అందిస్తున్నారు. తాజాగా ఆయన `సెల్ఫీ ఆఫ్ సక్సెస్` బుక్ గురించి ప్రస్థావిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం ఆసక్తికరంగా మారింది. “సక్సెస్ అనేది ముగిసిపోయేది కాదు. అదో నిరంతర జర్నీ“ అంటూ మహర్షిలో చూపించాం. అదే సక్సెస్ ని రకరకాల పార్శ్యాల్లో ఈ పుస్తకంలో ఆవిష్కరించారని మహేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకంలో `సక్సెస్` బ్యూటీని ఎంతో చక్కగా చెప్పారని అన్నారు. మహర్షి ఎడిషన్ అమెజాన్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఈ పుస్తకం చదవి.. మీ ఆప్తులకు కానుకగా ఇవ్వండి అని కోరారు. మంచికి నేను సైతం అంటూ సినిమాల్లో నటించడమే కాదు.. ఇలా విషయపరిజ్ఞానం ఉన్న పుస్తకాల గురించి మహేష్ ప్రచారం చేయడాన్ని మెచ్చుకుని తీరాలి. మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వురు అనే చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.