టాలీవుడ్ లో నిత్యావసరాల సాయం గురించి తెలిసిందే. అవసరార్థులైన 24 శాఖల కార్మికులకు ఈ సాయం అందుతోంది. అయితే ఏ శాఖకు చెందకుండా యూనియన్ కార్డ్ లేకుండా పొట్ట పోషించుకోవడానికి వచ్చిన కార్మికులను ఆదుకోవడం ఎలా? అనధికారికంగా ఇలాంటి వాళ్లు వేలల్లో ఉన్నారు. అందుకే అలా కార్డ్ లేకుండా కష్టాల్ని ఎదురీదుతున్న పేదల్లో కార్డ్ లేని వారికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చారు మూవీ ఆర్టిస్టుల సంఘం ఆర్టిస్టులు. మా సభ్యుల్లో హేమ- సురేఖా వాణి తదితరులు కార్డ్ లేని అసిస్టెంట్లకు డొనేషన్లు అందించారు.
ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ… “కార్డ్ లేని అసిస్టెంట్లు చాలా మంది ఉన్నారు. వారి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ సాయం చేస్తున్నాం. సెట్లో మమ్మల్ని అలంకరించేది బాగా చూసుకునేది అసిస్టెంట్లే. కొందరు డొనేషన్లు ఇచ్చిన మహిళా ఆర్టిస్టులు రాలేకపోయారు. వారికి ధన్యవాదాలు“ అన్నారు. సురేఖా వాణి మాట్లాడుతూ.. “అందరూ నిత్యావసరాలు పంచుతున్నారు. అవే కాకుండా ఇంట్లో ఇంకా అవసారాలుంటాయి. గ్యాస్ .. పాలు సహా ఇంకా అర్జెంట్ నీడ్స్. అందుకే వారికి డబ్బును సాయం చేస్తున్నాం“ అని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళా ఆర్టిస్టులు పాల్గొన్నారు. అయితే కార్డ్ లేని అసిస్టెంట్లు ఎంతమంది ఉన్నారో 24 శాఖల్లోనూ ఎందరు ఈ తరహా ఉన్నారో లెక్క గడితే వేలాది మంది నిర్భాగ్యులు ఉన్నారన్న అంచనా వెలువడుతోంది. వీరందరికీ పరిశ్రమ కానీ.. టీ- ప్రభుత్వం సాయపడుతోందా? అన్నది సందేహమే.
