తెలుగు మీడియా పాపమేనా ఇది
ప్రభాస్ సాహో ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజైన సంగతి తెలిసిందే. నాన్ బాహుబలి కేటగిరీలో ఓపెనింగ్ డే రికార్డులు బ్రేక్ చేసింది. ఓపెనింగ్ వీకెండ్ రికార్డులు ఎలా ఉండనున్నాయో వేచి చూడాల్సి ఉంది. బాహుబలి రికార్డుల్ని కొట్టేయకపోయినా.. తొలి వీకెండ్ వరకూ ఈ సినిమా భారీ వసూళ్లనే సాధించనుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. ఇదంతా బాగానే ఉంది కానీ… ఎన్నడూ లేనంతగా సాహోపై సాగుతున్న నెగెటివ్ ప్రచారం ఒక రకంగా తెలుగు సినిమా ఖ్యాతిని దిగజార్చేదిగా ఉందన్న క్రిటిసిజమ్ కనిపిస్తోంది.
ఇదంతా తెలుగు మీడియా పుణ్యమే! అంటూ మరో కోణంలోనూ విశ్లేషిస్తున్నారు కొందరు. రెండు సినిమాల కిడ్ అయిన సుజీత్ పై సోషల్ మీడియాలో మరీ దారుణంగా ట్రోల్స్ చేయడంపైనా చర్చ సాగుతోంది. ఇదే కాదు… అజ్ఞతవాసిని కాపీ కొట్టి సాహో తీశారంటూ చేస్తున్న విశ్లేషణలు అంతర్జాతీయ వేదికపైకి చేరిపోతున్నాయి. దీంతో పరువు తీసి పందిరేసినట్టు అయిపోతోంది. సోషల్ మీడియా ద్వారా ఇది కాస్తా లార్గోవించ్ దర్శకుడు జెరోమ్ సల్లే వరకూ వెళ్లింది. “నాకు ఇండియాలో బెస్ట్ కెరీర్ ఉందేమో!“ అంటూ మన మేకర్స్ పైనా అదిరిపోయే పంచ్ వేసేశాడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రానికి లార్గో వించ్ స్ఫూర్తి ఉందని అప్పట్లో పెద్ద డిబేట్ రన్ చేసిన తెలుగు మీడియా దెబ్బకు జెరోమ్ నేరుగా చట్టపరంగా చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పుడు మరోసారి అదే కథను క్యారక్టరైజేషన్ మార్చి తీశారంటూ విమర్శలు రావడంతో మరోసారి జెరోమ్ లైన్ లోకొచ్చి తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. అయితే కాపీ అంటూ మనకు మనమే పరువు తీసుకోవడమేనా ఇది. ఒకవేళ ఇది కాపీనే అయితే కాపీ రైట్ చట్టాలు ఉన్నాయి కదా?