ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. రైతులకు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. సరిహద్దుల్లో 70 రోజుల తరబడి రైతులు చేస్తున్న ఆందోళనకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు మద్దతు పలికారు. ఇదే మన బీజేపీ నాయకులకు నచ్చలేదు. ఇతర దేశాల సెలబ్రిటీలు ట్వీట్లతో రైతుల ఉద్యమం అంతర్జాతీయ వేదిక మీద నిలబడింది. పాప్ స్టార్ రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు జిమ్ కోస్టా, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సోదరి కుమార్తె మీనా హారిస్ మొదలువారు రైతు ఉద్యమానికి అనుకూలంగా ట్వీట్లు చేశారు.
దేశంలోని టీవీ ఛానెళ్లను, పత్రికలను అంటే కట్టడి చేయగలరు కానీ సోషల్ మీడియాను చేయలేరు కదా. అందుకే పాలకులు ట్విట్టర్ మీద పోరుకు దిగారు. ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న ఆందోళనకు సంబంధించి కేంద్రం 257 యూఆర్‌ఎల్‌లను, ఒక హ్యాష్ ట్యాగ్‌ను స్తంభింపజేయాల్సిందిగా సామాజిక మాధ్యమం ట్విటర్‌ను సోమవారం ఆదేశించింది. కేంద్ర ఫ్రీజ్ చేయాలని చెప్పిన ఖాతాల్లో రైతు సంఘాల నాయకులూ, ఆమ్ ఆద్మీ, సీపీఎం నేతలు మొదలైనవారు ఖాతాలున్నాయి. కేంద్రం ఆదేశాలు మేరకు వెంటనే వాటిని బ్లాక్ చేసినా తిరిగి పునరుద్ధరించింది ట్విట్టర్. దీంతో తమ అనుమతి లేకుండా ఎలా పునరుద్ధరిస్తారని ట్విట్టర్ మీద మండిపడుతోంది.
ఇక సెలబ్రిటీలు ట్వీట్లు చేయడంతో అమిత్ షా, నిర్మలా సీతారామన్, జయశంకర్, స్మృతి ఇరానీ లాంటి ముఖ్యులు వారికి కౌంటర్ ఇస్తూ ట్వీట్లు వేశారు. వారంటే రాజకీయ నాయకులు కాబట్టి ఏకపక్షంగా వారి తరపుకునే మాట్లాడుకుంటారు. కానీ దేశభక్తులమని చెప్పుకునే కొందరు సెలబ్రిటీలు మాత్రం బయటి సెలబ్రిటీలు ట్వీట్లతో నిద్రలేచారు. ఇన్నాళ్లు రైతుల ఉద్యమం గురించి కనీసం ఒక్క ట్వీట్ కూడ చేయని వీరంతా బయటి దేశాల సెలబ్రిటీలు రైతులకు మద్దతు తెలపడం ఏదో పాపమన్నట్టు, ఇండియాకు చేస్తున్న ద్రోహమన్నట్టు తల్లడిల్లిపోతున్నారు.
బాలీవుడ్ తారలు కంగన రనౌత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గణ్, కరణ్ జోహార్, సునీల్ శెట్టి లాంటి వారు ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేస్తున్నారు. మరి రైతుల పోరాటంలో న్యాయమే లేకపోతే ఈ దేశభక్తులంతా ఇన్నిరోజులు నోరెందుకు మెదపలేదో అర్థం కావట్లేదు. వీరిలో కొందరికి ఎప్పటి నుండో బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. సోషల్ మీడియాలో సైతం ఈ ఆర్టిస్టులందరూ పెయిడ్ ఆర్టిస్టుల్లా ఇప్పుడే నిద్రలేచారా, రెండు నెలలుగా ఉద్యమం సాగుతుంటే ఎవరో బయటివారు రైతులకు మద్దతిచ్చారని, అది తప్పని వాదిస్తూ ట్వీట్ల దాడికి దిగడం చూస్తే ఏమనుకోవాలి అంటూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.