ఈసీ ముందు హాజరైన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నిర్మాత,ఫైనల్ గా తేల్చిందిదీ

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన సంచలనాత్మక చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమాలో అభ్యంతరకరమైన అంశాలేమైనా ఉన్నాయా? లేదా? పరిశీలించేందుకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ముందు చిత్రం ప్రివ్యూను ప్రదర్శించాలని ఆ సినిమా నిర్మాత రాకేష్‌రెడ్డిని ఎన్నికల సంఘం ఆదేశించింది. సోమవారం ఉదయం 11.30 గంటలకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేయాలని సూచిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేఫద్యంలో నిర్మాత రాకేశ్‌రెడ్డి నేడు ఎన్నికల సంఘం ముందు హాజరయ్యారు. ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా సినిమా ఉందంటూ ఈసీకి ఫిర్యాదులు రావడంతో.. వివరణ ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది. ఈ నేపథ్యంలో ఈసీ సూచన మేరకు రాకేశ్‌రెడ్డి అమరావతిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 29వ తేదీనే సినిమా విడుదల ఉంటుందని స్పష్టం చేశారు.

‘‘ఈసీ సూచనల మేరకు ఇక్కడికి వచ్చాను. సినిమాలో ఉన్న సంఘటనల గురించి అధికారులు ఆరా తీశారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని ఈసీని మేము కోరాం. తెలుగుదేశం పార్టీ జెండాను, గుర్తును ఎక్కడా చూపలేదు. టీడీపీ జెండాలోని కలర్‌ను మాత్రమే వాడాం.

ఎన్టీఆర్ జీవితంలోని ఓ భాగాన్ని సినిమాలో చూపించాం. లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగానే సినిమా తీశాం. ఆనాడు జరిగిన సంఘటనలను మాత్రమే సినిమాలో చూపించాం.’’ అని రాకేశ్‌రెడ్డి తెలిపారు.

ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాలోని ప్రోమోలు, రాజకీయ ప్రకటనలు.. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ఉన్నాయని చిత్తూరు జిల్లాకు చెందిన పీ.మోహన్‌ ఈ నెల 14న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎంసీఎంసీ నుంచి తగిన అనుమతి తీసుకోకుండానే వీటిని ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు.