సంఘంలో మూడు వర్గాలు ఉంటాయి. ఒకటి క్యాపిటలిస్ట్ వర్గం. రెండోది కార్మిక వర్గం.. ఇంకొకటి ఆ రెండిటికీ మధ్యస్థంగా నలిగిపోయే వర్గం. క్యాపిటలిస్టులు ఎప్పుడూ పెట్టుబడులు పెడుతుంటారు. సంపదల్ని సృష్టిస్తుంటారు. రిచ్ లైఫ్ స్టైల్ ని ఆస్వాధిస్తూ తమ వ్యాపారాల వృద్ధిపైనే దృష్టి సారిస్తుంటారు. అయితే ఆ క్రమంలోనే తమ ప్రత్యర్థుల్ని పోటీకి రాకుండా బిజినెస్ లో వ్యూహాలు రచిస్తుంటారు. ఆ కోవలో టాలీవుడ్ ని పరిశీలిస్తే .. ఆ నలుగురు లేదా ఆ పది మంది యాక్టివ్ నిర్మాతల్ని క్యాపిటలిస్టులుగా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడూ వీళ్లు పెట్టుబడులు పెడుతూ సినిమాలు తీస్తుంటారు. వాటిని తమ థియేటర్లలోనే రిలీజ్ చేసుకుంటారు. లాభాలార్జిస్తుంటారు.
తమ ప్రయోజనాలకు భంగం కలిగేలా ఇతరులు వుంటే వారిని పైకి రానివ్వరు. ఆ క్రమంలోనే వీళ్ల దెబ్బకు నలిగిపోయే కొత్త వాళ్లు.. చోటా మోటా నిర్మాతలు వీళ్లందరినీ తాడిత పీడిత బాధిత వర్గాల్లో చేర్చాల్సి ఉంటుంది. ఏ నాటికైనా సక్సెస్ రాకపోతుందా? అని ఆశావహ ధృక్పథంతో ఎదురు చూసే బ్యాచీ అన్నమాట. సినిమాలు తీసినా థియేటర్లు దొరక్క ఇక్కట్ల పాలయ్యే కేటగిరీకి చెందుతారు వీరంతా. ఇక మూడో వర్గం మొదటి రెండు వర్గాలపై ఆధారపడి జీవించే కార్మిక వర్గం.
అయితే ఇప్పుడు కరోనా కల్లోలం నేపథ్యంలో ఈ మూడు వర్గాల్లో ఎవరు ఎక్కువ నష్టపోయారు? అంటే.. ఎవరైతే ఎక్కువ పెట్టుబడులు వెదజల్లుతారో.. ఎవరైతే సంపదలు సృష్టించి లాభాలు ఆర్జిస్తుంటారో అలాంటి వాళ్లంతా కోట్లలో నష్టపోయారని అంచనా వేస్తున్నారు. దాదాపు రెండు నెలల పాటు థియేటర్లు ఓపెన్ కాలేదు. షూటింగులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆల్రెడీ పూర్తయిన సినిమాల్ని రిలీజ్ చేయలేని దుస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఇప్పటికే కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టేసిన ఆ నలుగురు లేదా ఆ పదిమంది యాక్టివ్ గిల్డ్ నిర్మాతలకే పెద్ద నష్టం వాటిల్లనుందని అంచనా వేస్తున్నారు. వీళ్లకే మెజారిటీ థియేటర్లు ఉంటాయి కాబట్టి వాటి మెయింటెనెన్స్ అయినా సంపాదించుకోలేక ఉద్యోగులకు ఎదురు జీతాలివ్వాలి కాబట్టి ఆ మేరకు నష్టం తప్పడం లేదని విశ్లేషిస్తున్నారు.
బిజినెస్ కుప్పకూలడంతో ఎటూ తోచక కొట్టుమిట్టాడుతున్న ఆ నలుగురు అత్యవసర భేటీలు అంటూ ప్రభుత్వంతో మాట్లాడుతున్నా లాక్ డౌన్ లు తీసేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఇక అన్నిటికీ పరిష్కారం కోరుతూ ఈ శుక్రవారం ఉదయం నిర్మాతల మండలి కీలక సభ్యులంతా సమావేశం అవుతున్నారు. మరి దీనిలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు? అన్నది చూడాలి. ఇక ఆ నలుగురు యాక్టివ్ అయితేనే తిరిగి కార్మికులకు ఉపాధి లభిస్తుంది. అలా కాకుండా ఏ సినిమాలు తీయకుండా మేం కూడా నిర్మాతలమేనని చెప్పుకుని మండలి అందించే సంక్షేమ ఫలాల్ని ఆస్వాధిస్తూ మండలి నిధిని కరగదీసే వ్యర్థ నిర్మాతల వల్ల కూడా ఏ మేలూ ఉండదన్నది అక్షర సత్యం.