నిత్యం పద్యాలు, శ్లోకాలు పఠించే బాలకృష్ణ అప్పుడప్పుడు వాటిని సమూహం ముందు వల్లిస్తుంటారు. జనానికి మంచిని భోదించాలనేది ఆయన తపన. పలు సినిమా ఫంక్షన్లలో, వేడుకల్లో వేదిక మీద అనర్గళంగా శ్లోకాలు చెప్పి ఔరా అనిపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన అప్పుడప్పుడు పాటలు పాడటమే కాస్త విపరీతం అనిపిస్తుంటుంది. నీ కంటి చూపుల్లోకి నా ప్రాణం చేరిందే అంటూ అప్పుడెప్పుడో బాలయ్య పాట పాడిన విధానాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. తన ‘పైసా వసూల్’ చిత్రంలో కూడ మామ ఏక్ పెగ్ లా.. అంటూ పాట పాడి పర్వాలేదనిపించారు బాలయ్య.
ఇటీవల తన పుట్టినరోజు సంధర్బంగా శివశంకరి పాటను పాడి రికార్డ్ చేసి బయటికి వదిలారు. ప్రయత్నం మంచిదే అయినా ఫలితం మాత్రం బెడిసికొట్టింది. రాని పని పదే పదే చేసి చేదు అనుభవాలను మూటగట్టుకోవడం అవసరమా అనే విమర్శలు వచ్చాయి. అభిమానులు సైతం తమ హీరో ప్రయత్నాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎవరైనా సరే ఇలాంటి అనుభవం తర్వాత మళ్ళీ అలాంటి ప్రయత్నం చేయడానికి వెనుకాడతారు. కానీ బాలయ్య మాత్రం వెనకడుగు వేయట్లేదు. ఈసారి ఇంకో పాటతో రాబోతున్నారు.
రేపు మే 28న స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఒక గిఫ్ట్ రెడీ చేశారు ఆయన. అదే శ్రీరామ దండకం. బాలయ్య స్వయంగా దండకాన్ని ఆలపించి వినిపించనున్నారు. ఉదయం 9:45 గంటలకు ఈ దండకం రిలీజ్ కానుంది. మరి ఈసారి అభిమానులు, శ్రోతలు బాలయ్య ప్రయత్నాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి.