కన్నడ ‘రెబల్ స్టార్’ అంబరీష్ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి అంబరీష్ బెంగుళూరులో కన్నుమూశారు. ఆయన వయస్సు 66 ఏళ్లు. గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. గుండెపోటు రావడంతో ఆయనను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.
బహుభాషా నటి సుమలత ఆయన భార్య. వీరికి అభిషేక్‌ ఒక్కడే కుమారుడు.

అభిషేక్‌ను కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే తన కుమారుణ్ని వెండి తెరపై చూడక మునుపే అంబరీశ్‌ కన్ను మూశారు. నటి సుమలతను 1991లో వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం.

మండ్య జిల్లాలో శనివారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో 30 మంది మృతి చెందిన ఘటన వివరాలు తెలుసుకుని ఆయన ఎమోషన్ అయ్యారు. తనకు అనారోగ్యంగా ఉందని, శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉందని, లేకుంటే బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లేవాడినని ఓ టీవీ ఛానెల్ వారితో మాట్లాడారు . ప్రమాదం విషయాన్ని ఊహించుకుంటేనే బాధను తట్టుకోలేకపోతున్నానని చెప్పారు.

రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయన ఆరోగ్య సమస్య తీవ్రం కావడంతో జేపీనగరలోని ఆయన నివాసం నుంచి విక్రం హాస్పటిల్ కు తరలించారు. వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్సను కొనసాగించారు. 10 గంటల సమయంలో ఆయన మృతి చెందారని డాక్టర్లు ప్రకటించారు.

అంబరీష్ మృతికి తెలుగు సినీరాజ్యం నివాళులు అర్పిస్తోంది.