విరోధులుగా మారిన ఫైర్ బ్రాండ్స్
కంగన వర్సెస్ తాప్సీ ఎపిసోడ్స్ అన్నివేళలా హాట్ టాపిక్. సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం రెండు విషయాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. బాలీవుడ్ ఇన్ సైడర్స్ .. బాలీవుడ్ ఔట్ సైడర్స్.. పై ముచ్చట వేడెక్కించింది. బాలీవుడ్ లో రకరకాల రాజకీయాల గురించి ఇటీవల ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా నటవారసత్వం.. ఇండస్ట్రీలో స్వపక్షం.. స్వరాజ్యం అనే స్వార్థ రాజకీయాల్ని తూర్పారబడుతూ కంగన చెలరేగుతున్న సంగతి విధితమే. బాలీవుడ్ మాఫియాని క్వీన్ ఎడా పెడా తిట్టేస్తూ నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. అయితే ఈ విషయాల్లో తాప్సీ పన్ను వెర్షన్ ఎలా ఉంది? క్వీన్ కంగన అంటేనే అంతెత్తున ఎగిరిపడే తాప్సీ తనకు వ్యతిరేకంగా స్పందిస్తోందా లేక అనుకూలంగానే ఉంటోందా? అంటే డీటెయిల్స్ లోకి వెళ్లాలి.
కంగన తర్వాత తాప్సీనే బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్. ఆ ఇద్దరూ ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ కానేకాదు. బయటి నుంచి వచ్చినవారే. అలాంటప్పుడు ఒకరికొకరు సమర్థించుకోవాలి కదా? కానీ ఎందుకని వైరి వర్గాలుగా మారి కొట్టుకుంటున్నారు? ఆ ఇద్దరి మధ్యా మాటా మాటా ఎందుకని వచ్చినట్టు? అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కరణ్ జోహార్ లాంటి దర్శకులతో సన్నిహితంగా ఉండడం.. నటవారసులకు బాసటగా నిలవడం కంగనకు ఏమాత్రం నచ్చదు. తాప్సీ.. స్వరా భాస్కర్ లాంటి బి-గ్రేడ్ నటీమణులు బి-గ్రేడ్ సినిమాలు చేస్తున్నారు. ఎందుకంటే వారు కరణ్ జోహార్ వెన్నంటి తిరిగేస్తుంటారు. ఆ ఇద్దరూ అలియా భట్ – అనన్య పాండే కంటే ఎక్కువగా ఆయనను రాసుకుపూసుకు తిరిగేస్తూ మెరుగ్గా ఉన్నారు అంటూ తిట్టేసింది కంగన ఓసారి. అలాంటప్పుడు తాప్సీ ఎలాంటి కౌంటర్ వేస్తోంది? అంటే..
పదో తరగతిలో లేదా 12వ తరగతి తర్వాత బాలీవుడ్ నటీమణుల రిజల్ట్ అలాగే గ్రేడ్ లు కూడా బయటపడిపోయాయి! అంటూ కంగనపై తాప్సీ వేసిన పంచ్ కూడా అంతే హైలైట్. బాక్సాఫీస్ లెక్కల్ని బట్టి నటీమణుల స్థాయిని నిర్ణయించే కంగనను తప్పు పట్టింది తాప్సీ. అసలు కంగన తనని ఎప్పుడు ఏది అన్నా వెంటనే స్పందించి కౌంటర్ వేయడం తాప్సీ అలవాటు. మంచి సినిమాల్లో నటించనంత మాత్రాన మంచి నటి కాకపోరని కంగనపై ఫైరైంది తాప్సీ.