`మూవీ మాఫియా`ని మళ్లీ ఏకి పారేసిన క్వీన్
క్వీన్ కంగన రనౌత్ నాలుకకు నరం తెగి చాలా కాలమే అయ్యింది. `మూవీ మాఫియా`ల్ని తనదైన శైలిలో ఏకి పారేస్తోంది. ముఖ్యంగా ఖాన్ లు.. కపూర్లు.. బచ్చన్ లు.. భట్స్ .. చోప్రాస్ అంటే రుసరుసలాడేస్తుంది. ఇక రోషన్లతో నేరుగానే ఢీ అంటే ఢీ అంటుంది. కోర్టుల పరిధిలోనూ రోషన్లతో పోరాటం చేస్తోంది.
అదంతా అటుంచితే సుశాంత్ సంగ్ రాజ్ పుత్ బలవన్మరణం వెనక ఉన్న మూవీ మాఫియాల్ని కంగన ఇటీవల కడిగేస్తోంది. బాలీవుడ్ హెవీవెయిట్స్ గా చెప్పుకునేవాళ్లందరినీ ‘మూవీ మాఫియా’ అని కంగన పిలుస్తోంది. తన జీవితాన్ని నాశనం చేయడానికి ఈ మాఫియా ప్రముఖులు ప్రయత్నించారని కంగనా రనౌత్ ఎన్నోసార్లు పదేపదే ఆరోపిస్తూనే ఉన్నారు. ఒక ‘వ్యూహాత్మక’ ప్రణాళిక ద్వారా వారు తన ఆర్థిక అవకాశాలను నాశనం చేశారని .. సామాజికంగా పరిహాసం చేశారని.. తనను.. తన వృత్తిని నాశనం చేయడానికి కూడా ప్రయత్నించారని కంగన వాదించింది.
ప్రఖ్యాత రిపబ్లిక్ టీవీలో అర్నాబ్ గోస్వామికి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కంగనా, “మూవీ మాఫియాతో నేను ఎదుర్కొన్న నా అనుభవాన్ని మీకు చెబుతున్నా. ఒక ప్రణాళిక ప్రకారం దెబ్బ కొట్టడం ఎలానో వాళ్లకు మాత్రమే తెలిసిన విద్య. నేను 2016 లో అగ్ర నాయికగా ఉన్నత స్థానానికి ఎదిగినప్పుడు నన్ను తొక్కేసేందుకు కుట్ర చేశారు. తను వెడ్స్ మను రిటర్న్స్ లాంటి అతి పెద్ద బ్లాక్ బస్టర్ నేను ఇచ్చానని అందరికీ తెలుసు. ఆ తర్వాత నేను 19 బ్రాండ్లపై సంతకం చేశాను. 2016 లో ఏ నాయికకు సాధ్యం కాని విధంగా ది బెస్ట్ ఎవరు? అంటే అది నేనే అని భావిస్తాను. అకస్మాత్తుగా 2013 నుండి అంతా మారిపోయింది. నా మాజీ నుంచి 2013 లో విడిపోయాను. అతను వచ్చి నాపై ఒక తెలివితక్కువ కేసు వేస్తాడు. దీనిని దేశం మొత్తం, ‘వావ్, ఇది కొంచెం విచిత్రమైనది’ అని అనుకుంటుంది. నిజానికి ఇది విచిత్రమైనది కాదు, ఇది చాలా వ్యూహాత్మకమైనది“ అని ప్రతిదీ విశదపరిచింది.
ఒక ఇంటర్వ్యూలో ఆమెను ‘సిల్లీ’ మాజీ అంటూ తీసిపారేసిన హృతిక్ రోషన్ ఆమెకు పంపిన లీగల్ నోటీసు గురించి ప్రస్తావించింది. మేం రిలేషన్ షిప్ లో ఉన్నామని కంగన పేర్కొంది. అయితే అది వృత్తిగతమైన సంబంధమా లేక వ్యక్తిగత సంబంధమా? అన్నదానిపై ఇప్పటికీ చాలామందికి తెలియదు. తమ మధ్య వివాదం వల్ల ఆల్మోస్ట్ అన్ని కార్పొరెట్ కంపెనీలు బ్రాండ్లకు సంబంధించిన కాంట్రాక్టుల్ని రాత్రికి రాత్రే రద్దు చేసుకున్నాయని కంగనా తెలిపింది.
ఆ కేసు ఎటూ కదలకపోయనా కానీ అన్ని బ్రాండ్లు నన్ను వదిలివేసాయి. ఆ ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుని నేను కొన్ని పెట్టుబడులు పెట్టాను. నేను పెద్ద ఇబ్బందుల్లో పడ్డాను అని చెప్పింది. తనను ‘మ్యాన్-ఈటర్’ అని.. ‘నిమ్ఫోమానియాక్’ అని చిత్రీకరించాక వివాహం చేసుకోవటానికి .. అలాగే కుటుంబాన్ని కలిగి ఉండటానికి తనకు అవకాశం లేకుండా పోయిందని కూడా కంగనా ఆవేదన చెందింది.
అమె మగాళ్లను తినేసే టైపు. తన నగ్న చిత్రాలను పంపుతుంది. ఆమె రక్తాన్ని తాగుతుంది. ఆమె మంత్రగత్తె అంటూ తనపై ప్రచారం చేశారట. అదంతా వ్యూహాత్మకమేనని కంగన చెప్పుకుంది. కొద్దిరోజుల క్రితం, నేను చాలా మంది పురుషులు మెచ్చిన అందమైన అమ్మాయి.. కానీ అకస్మాత్తుగా, వివాహం నా జీవితానికి సరికాదని నిర్ణయించుకోవాల్సి వచ్చింది అని కూడా కంగన వెల్లడించింది.