ఖాన్.. కపూర్.. రోషన్.. భట్స్.. చోప్రా.. ష్రాప్.. ఎవరినీ వదలదా?
ఖాన్స్.. కపూర్స్ .. భట్స్.. రోషన్స్.. చోప్రా.. ష్రాప్స్.. ఇంకా ఎందరిని ఆడుకుంటుంది? ఏమో చూస్తుంటే బాలీవుడ్ లో ఎవరినీ వదిలేట్టు లేదు కంగన. ది గ్రేట్ రెబల్ క్వీన్ దెబ్బకు గజగజ ఒణుకుతోంది బాలీవుడ్ మాఫియా. ఇంకా ఎందరిని అల్లాడిస్తుంది?
బాలీవుడ్ ఇన్ సైడ్ వాళ్లను తప్ప బయటి వ్యక్తుల్ని లోనికి రానివ్వదన్నది ఓ ఆరోపణ. అప్పటికే పోగుపడి ఉన్న ఫ్యామిలీ హీరోలు వారి వారసులు బయటి హీరోలపై కుట్రలు చేస్తారని ఎదగనివ్వరని తీవ్ర ఆరోపణలు చేయడం ఇటీవల వేడెక్కించేసింది. సుశాంత్ సింగ్ ఆతహత్య తర్వాత ఈ ఆరోపణలు రెట్టింపై హీటెక్కిస్తున్నాయి. అయితే ఇలాంటి భయంకర మాఫియా పరిశ్రమలోనూ తనని ఎవరూ ఏమీ చేయలేరని ప్రూవ్ చేసింది కంగన. తాను బయటి వ్యక్తి అయినా కానీ అక్కడ ఎందరికో చెమటలు పట్టించేస్తూ కంగన ఆడుతున్న ఆట చూస్తున్నదే.
ఖాన్ లు .. కపూర్లు.. రోషన్ లు కంగన దెబ్బకు పరేషాన్ అయ్యారు. వీళ్లెవరినీ నోరెత్తనీకుండా ఆడుకుంది. రోషన్ లపై కోర్టుల పరిధిలోనూ పోరాడిన ఘనత కంగనకే చెల్లింది. ఇక భట్స్ విషయంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆలియాభట్ .. కరణ్ జోహార్.. వంటి వారిని బతికి బట్ట కట్టనివ్వదు. లేడీ ఓరియెంటెడ్ బాట పట్టాక వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టిన కంగన పురుషాధిక్య ప్రపంచాన్ని ఓ రేంజులోనే ఆడుకుంది. ఇప్పుడు ఈ జాబితాలో ష్రాఫ్ లను కూడా చేర్చి ఆటాడేస్తోంది. తాజాగా అనితా ష్రాఫ్ అదజానియా తనని తీవ్రంగా అవమానించిందని ఏ లిస్టర్ కాదని దూరం పెట్టేసిందని ఆరోపించింది. ప్రఖ్యాత వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీ షూట్ కోసం వెళ్లినప్పుడు తనకి డిజైనింగ్ చేసేందుకు స్టైలింగ్ చేసేందుకు నిరాకరించిందని ఆరోపించిన కంగన అసలు తనవల్లనే ఆ మ్యాగజైన్ లాభపడిందని దాని వల్ల తనకు ఎలాంటి ఉపయోగం లేదని తీసి పారేసింది. అంతేకాదు.. ఇప్పటికీ తన ఫోటోలు.. వీడియోల్ని సదరు మ్యాగజైన్ వాళ్లు వాడుకుంటున్నారని దుయ్యబట్టింది.
2008 లో నా చిత్రం `ఫ్యాషన్` విడుదల సమయంలో, వోగ్ కోసం ప్రియాంక చోప్రాతో ఒక కవర్ షూట్ చేసారు. నా ముఖచిత్రంతో కవర్ పేజీ వేయడానికి నిరాకరించింది వోగ్ యాజమాన్యం అని చెప్పింది కంగన. నేను ఎ-లిస్టర్ కాదని అందుకే కుదరదని చెప్పారని తెలిపింది. ఐదేళ్లుగా తాను వోగ్ కి దూరంగా ఉన్నానని తెలిపింది. మణికర్ణిక చిత్రానికి ప్రచారం కావాల్సిందిగా సంప్రదించినా వారు పక్కన పెట్టారని వెల్లడించింది. డబ్బు సంపాదించడానికి నా పాత వీడియోలను ఉపయోగించడం సరైనదేనా? అని వోగ్ ని ప్రశ్నించింది. “2014 లో వోగ్ కవర్ పేజీ కోసం నన్ను సంప్రదించారు కానీ అనిత నాకు స్టైలింగ్ చేయడానికి నిరాకరించింది. ఆమె తన సహాయకుడిని పంపింది. వారు ఆ ఫోటోషూట్ ని ముఖేష్ మిల్లుల్లో చిత్రీకరించారు“ అని నాటి విషయాన్ని చెప్పుకొచ్చింది కంగన. 2015లో తాను ఆకస్మికంగా పెద్ద స్టార్ అయ్యాక మాత్రం అవార్డు వేడుకలకు అందాల పోటీలకు రమ్మని వోగ్ బృందం ఆహ్వానించిందని కంగన తెలిపింది.
వారి పనిని నేను చాలా అవమానంగా భావించాను. నేను వోగ్ కి చేసినది రెండు కవర్ షూట్లు మాత్రమే. వారు నన్ను బహిరంగంగా నిషేధించినట్లు చెప్పమనండి! అంటూ తూర్పారబట్టింది. ముఖ్యంగా అనితా ష్రాఫ్ ని కంగన ఓ రేంజులో ఆడేసుకుంది.