‘భారతీయుడు 2’ ఫస్ట్‌లుక్‌ …ఆ విషయమే హైలెట్

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ‘భారతీయుడు’.అవినీతికి లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసిన పోరాటం ప్రజలను ఎంతగానో మెప్పించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేసేందుకు మరోసారి కమల్, శంకర్ ముందుకొచ్చారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పస్ట్‌లుక్‌ను చిత్రబృందం వదిలింది. ఈ ఫస్ట్‌లుక్ చూస్తే భారతీయుడు సినిమాలో సేనాపతి పాత్ర మన కళ్లదెరుగా కనపడుతుంది.

ఈ పోస్టర్ లో కమల్‌ తన వర్మ కళను ప్రదర్శిస్తూ కనిపించారు. అంటే ఈ కథలో కూడా వర్మ కళ హైలెట్ గా సాగనుందని అర్దమవుతోంది. జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మొదట ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను డిసెంబరు 14న హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి. రెండో షెడ్యూల్‌ చెన్నైలో జరగనుందని చెప్పుకొచ్చారు.

శంకర్‌ ‘2.0’ బ్లాక్‌బస్టర్‌ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కమల్‌ మరోపక్క ‘శభాష్‌ నాయుడు’ సినిమాలో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల్ని కమలే‌ చూసుకుంటున్నారు. రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శ్రుతిహాసన్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.