పాత్రికేయులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదని, తమను నమ్ముకుని ఓ కుటుంబం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నటుడు కార్తి కోరారు. తమిళ మూవీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన జర్నలిస్టుల పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఆయన మాటల్లోనే…
‘పాత్రికేయులు చాలా బిజీగా ఉంటారు. వారి వృత్తి అలాంటిది. ఒక్కో రోజు వివిధ ప్రాంతాల్లో నాలుగు ప్రెస్‌మీట్‌లు ఉంటాయి. అన్నింటికీ హాజరుకావాల్సి ఉంటుంది. దీనికోసం కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతుంటారు. ఓ ప్రెస్‌మీట్‌లో భోజనం ఉన్నాకానీ, మరో సమావేశానికి వెళ్లాలని భోజనం చేయ్యకుండా వెళ్లిపోతారు.
నిజం చెప్పాలంటే చాలినంత నీళ్లు కూడా తాగరు. సరిపడా నీళ్లు తాగడం మనిషికి చాలా ముఖ్యం. మా నాన్న మాకు యోగా నేర్పారు. యోగా చేయడం మంచి అలవాటు. అది ఒత్తిడిని దూరం చేస్తుంది. 20 నిమిషాలు చేసినా.. గొప్ప ఫలితం ఉంటుంది.
రోజూ కారులో తిరుగుతున్న నాకే వెన్నునొప్పి వస్తోంది. ఇక బైక్‌లో తిరుగుతూ, కుర్చీలకు పరిమితమవుతున్న మీకు తప్పకుండా వెన్నునొప్పి ఉంటుంది. ఆరోగ్యంపై దయచేసి శ్రద్ధ తీసుకోండి. మిమ్మల్ని నమ్ముకుని ఓ కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తించుకోండి. ఆ విషయాన్ని మరిచిపోకండి.
ఇటీవల కొన్ని రోజులు నాకు తలనొప్పి వచ్చింది. తలనొప్పే కదా అని నిర్లక్ష్యం చేశా. తీరా చూస్తే లివర్ సమస్య అని తేలింది. అందుకే చెబుతున్నా.. సమాజానికి చూపునిచ్చే కళ్లులా ఉన్న మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
35 ఏళ్లు దాటిందంటేనే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోండి’ అని కార్తీ ప్రసంగించారు. ఇటీవల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి అనేక మంది జర్నలిస్టులు తమ ప్రాణాలను వదిలారు. ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.