జానీ మాస్టర్‌కి ఆర్నెళ్ల జైలు శిక్ష, కేసు ఇదీ

జిగేలు రాణి.. సినిమా చూపిస్తా మామా.. లైలా ఓలైలా.. మీ తాత టెంపర్.. కమ్ టు ద పార్టీ.. పిల్లా నువ్వు లేని జీవితం.. వంటి బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్స్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులను ఇచ్చి టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.
ఆయన కు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. సెక్షన్ 324, 506 కింద 6 నెలల శిక్ష విధించింది.

జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురికి జైలు శిక్ష పడింది. జానీ మాస్టర్ పై 2015 సంవత్సరంలో సెక్ష‌న్ 354, 324, 506 కింద కేసు నమోదు చేయగా.. ఇవాళ దీనిపై తీర్పు వ‌చ్చింది. సెక్ష‌న్ 354 కేసుని కొట్టివేసి.. 324, 506 సెక్ష‌న్ల కింద నేరం రుజువైనట్లు కోర్టు నిర్దారించింది. దీంతో జానీ మాస్టర్ తో పాటు మరో 5 మందిని జైలుకు తరలించారు పోలీసులు.

కేసు వివరాలు…

2015లో మేడ్చల్ మండలంలోని కండ్లకొయ్యలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో జానీ మాస్టర్ తన టీంతో కలిసి పాల్గొన్నారు. అయితే ఓ పాట విషయంలో జానీ మాస్టర్ టీమ్‌కి మరో టీమ్‌కి మధ్య గొడవ గొడవ జరిగింది.

ఈ గొడవలో డ్యాన్స్ మాస్టర్ జానీ బృందం తమపై దాడికి పాల్పడ్డారని మరో బృందం మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసును దర్యాప్తు చేసిన పోలీసులు జానీ మాస్టర్‌తో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ ముద్దాయిలుగా చేర్చారు.

2015 నుండి మేడ్చల్‌లోని సివిల్ సీనియర్ కోర్టులో ఈ కేసు విచారణ జరగగా నేడు తీర్పు వెలువడింది. సుదీర్ఘ వాదనల అనంతరం.. దాడికి పాల్పడిన డ్యాన్స్ మాస్టర్ జానీతో పాటు కోయిడ వేణు, ఘన్ శ్యామ్, వెంకటరమణ, ఎర్రోళ్ల రమేష్, ఎర్రపల్లి ప్రకాష్ లను నిందితులుగా గుర్తించింది కోర్టు. దీంతో ఒక్కొక్కరికి 6 నెలల జైలు శిక్షతో పాటు 1500 జరిమాన విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.