శవాలపై చిల్లర .. రివ్యూ రైటర్స్ పై భగ్గుమన్న జీవిత
నటి, నిర్మాత, దర్శకురాలు జీవితకు మరోసారి కోపం వచ్చింది. అయితే ఈసారి ఈ కోపం రివ్యూలు రాసేవాళ్లమీద. తమ భర్త నటించిన కల్కి చిత్రానికి, తన కుమార్తె నటించిన దొరసాని చిత్రానికి సరైన రివ్యూలు రాయలేదని ఆమెకు బాధ కలిగింది. సినిమా బాగోలేదని అనటం ఆమెకు నచ్చలేదు. దాంతో ఆమె ఒక్కసారిగా భగ్గుమంది.
జీవిత మాట్లాడుతూ.. ఇది వరకు ఓ సినిమా విడుదలైతే, వారం రోజుల తరవాత రివ్యూలు వచ్చేవని, ఇప్పుడు థియేటర్లో కూర్చుని సినిమాని విశ్లేషించడం మొదలెడుతున్నారని, సినిమాని ఒక్కొక్కరూ ఒక్కో కోణంలో చూస్తారని, విమర్శకుడి అభిప్రాయాన్ని ప్రేక్షకులపై రుద్దవద్దని కోరారు జీవిత.
అలాగే రివ్యూల వల్ల బిలో యావరేజ్ సినిమాలు కూడా నాశనం అయిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా నిలబడడానికి కొంత సమయం ఇవ్వాలని, ఆ తరవాతే రివ్యూ రాయాలని ఆమె కోరారు. తనకు `దొరసాని` బాగా నచ్చిందని, ఇప్పటికే మూడుసార్లు చూశానని, ఆనంద్, శివాత్మిక బాగా నటించారని కితాబిచ్చారామె.
ఇక తన పేరుని ట్రోల్ చేసేవాళ్లని తిట్టిపోసారు. `నేనేం మాట్లాడిన ట్రోల్ చేస్తారని తెలుసు. నా వ్యాఖ్యల్ని రకరకాలుగా వక్రీకరించి వీడియోలు చేసుకోవడం, శవాలపై చిల్లర ఏరుకోవడం ఒక్కటే` అంటూ ఘాటుగా విమర్శించింది.