ఎడిటర్ మోహన్ తనయుడుగా జయం రవి సుపరిచితుడై తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకోవడం కోసం గత కొన్నేళ్లుగా తమిళ చిత్ర సీమలో శ్రమిస్తూనే వున్నాడు.ఆ ప్రయత్నాల్లో మరోసారి జయం రవి చేస్తున్న స్వలింగ సంపర్క(గే) నేపథ్యం మూవీ కోమలి
(కో..మాలి). కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రదీప్ రంగనాథన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
16 ఏళ్ల క్రితం కోమాలోకి వెళ్లిన ఓ గే తిరిగి నిదుర లేస్తాడు. ఆ తరువాత అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అన్నది ఆసక్తికరంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ఇందులోని ఓ చిన్న క్లిప్ లో రజనీ తన రాజకీయ అరంగేట్రంపై ప్రసంగిస్తున్న వీడియో ఉంది. రజనీ రాజకీయాలపై ఓ పంచ్ డైలాగ్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చలేదు. 1996లోనే రజనీ రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఇప్పటికి వస్తారా? అన్నది ఆ డైలాగ్ లో సెటైర్ లా పేలింది. దీనిపై తలైవా అభిమానులు మండిపడుతున్నారు.
ట్రైలర్ లో ఆ సన్నివేశాన్ని ఎట్టిపరిస్థితుల్లో తొలిగించాల్సిందే అంటూ రజనీ ఫ్యాన్స్ పట్టుబడుతున్నారు. ట్రైలర్ లో రజనీ కనిపించేది కొన్ని సెకన్లే అయినా ఫ్యాన్స్ మాత్రం ఆ సీన్ పై రచ్చ చేస్తుండటంతో జయం రవి చిత్రానికి కావాల్సినంత ఫ్రీ పబ్లిసీటీ దొరుకుతోంది. అయితే వివాదాలతో పబ్లిసిటీ వచ్చినా కంటెంట్ లేకపోతే సినిమాలు ఆడని సన్నివేశం ఉందిప్పుడు. జయం రవి ఆ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడు? అన్నది జయాపజయాల్ని నిర్ణయిస్తుంది. త్వరలో రిలీజ్ కి వస్తున్న కోమలి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి.