HHVM: వివాదంలో పవన్ హరిహర వీరమల్లు… విడుదల అడ్డుకుంటాం అంటూ హెచ్చరికలు?

HHVM: పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈనెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి విడుదల కాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా జూన్ 12వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ జూలై 24వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమయింది.

ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై ఎంతో మంచి అంచనాలను కూడా పెంచేసాయి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పోరాట యోధుడిగా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో బీసీలను కించపరిచే విధంగా తెలంగాణ పోరాట యోధుడు పండుగ సాయన్న చరిత్రను వక్రీకరించారంటూ ముదిరాజ్ లు నిరసనకు దిగారు. అంతేకాకుండా సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

పండుగ సాయన్నను పోలిన కల్పిత పాత్రను సృష్టించి సినిమాగా రూపొందించడం అనేది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయా సామాజిక వర్గానికి చెందినవారు తీవ్రస్థాయిలో నిరసనలు చేపడుతున్నారు. ఇలాంటి సినిమాలను తప్పకుండా నిషేధించాలని ఈ సినిమా విడుదల చేయటానికి వీలులేదు అంటూ పెద్ద ఎత్తున నిరసనలను వ్యక్తం చేస్తున్నారు.సంబంధం లేని అంశాలను సినిమాలో పొందుపరిచారని ఆరోపిస్తున్నారు. డబ్బుల కోసం తప్పుదారి పట్టించేలా మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రాన్ని బహుజనలందరూ కలిసి అడ్డుకోవాలని హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఇలా పవన్ సినిమాని అడ్డుకుంటాం అంటూ చేస్తున్నటువంటి నిరసనలపై పవన్ కళ్యాణ్ అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమాని అడ్డుకోవడం ఎవరి తరం కాదని, సినిమా అనుకున్న సమయానికి విడుదల అవుతుంది అంటూ ఈ ఘటనపై స్పందిస్తున్నారు.