స్టార్ డైరెక్టర్ శంకర్ ఓ సినిమా తీస్తున్నారంటే దానిపై జాతీయ స్థాయిలో విస్త్రతంగా చర్చ సాగుతుంది. ముఖ్యంగా యువతరంలో ఈ సినిమా గురించిన ఆసక్తి వ్యక్తమవుతుంది. జెంటిల్ మేన్, భారతీయుడు, రోబో, అపరిచితుడు, 2.0 .. ఇలా ప్రతి సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగింది. అతడు ఎంచుకునే కథాంశం.. కాన్వాసులో భారీతనం.. బడ్జెట్.. విజువల్ ఎఫెక్ట్స్.. సెట్స్.. మేకప్ .. ఇలా ప్రతిదీ హాట్ టాపిక్.
ప్రస్తుతం `భారతీయుడు 2` గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా ప్రారంభం నుంచి రకరకాల కారణాలతో వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కొంత చిత్రీకరణ జరిగాక అడ్డంకులు ఎదురయ్యాయి. బడ్జెట్ పరంగా లైకా సంస్థ వెనకడుగు వేసిందని.. హీరో కమల్ హాసన్ రాజకీయాల్లో బిజీ అయ్యారని.. రకరాకల కారణాలు వినిపించాయి. అయితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ని తిరిగి ప్రారంభించేందుకు టీమ్ రెడీ అవుతోంది. ఆగస్టులో ఆంధ్ర ప్రదేశ్ రాయలసీమలో కీలక షెడ్యూల్ ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ షూటింగ్ లో హీరో సిద్ధార్థ్ సహా పలువురు కీలక ఆర్టిస్టులు షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. అయితే కమల్ హాసన్ పేరు మాత్రం వినిపించడం లేదు. దీంతో అభిమానుల్లో సందేహం రేకెత్తిస్తోంది. ఇంతకీ కమల్ హాసన్ ఏమయ్యారు? ఆయన ఈ ప్రాజెక్టులో ఉన్నారా లేదా? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
ఇటీవల కమల్ హాసన్ స్థానంలో వేరొక హీరో నటించే వీలుందన్న ప్రచారం సాగిన నేపథ్యంలో ఈ సందేహం వ్యక్తమైంది. అసలు ఏం జరుగుతోంది? కమల్ నటిస్తారా? లేదా? అన్నది విచారిస్తే .. ఆయన ఆగస్టు 31న సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమాని ఆగస్టు 19 నుంచి ప్రారంభం కావాల్సి ఉంటే ఆగస్టు 12 నుంచే మొదలు పెట్టాలని లైకా బృందం ప్లాన్ చేస్తోందట. అప్పటికి కమల్ హాసన్ అందుబాటులో ఉండరని తెలుస్తోంది. ఈ చిత్రం నుంచి కాజల్ తప్పుకున్నారని ప్రచారమైంది. అయితే దానికి అధికారికంగా క్లారిటీ లేదు. రకుల్ ప్రీత్, దిల్లీ గణేష్, ఐశ్వర్యా రాజేష్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరో సిద్ధార్థ్.. కమల్ కి కుమారుడి పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. డీవోపీ రత్నవేలు ఇటీవలే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.