గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేశారు మూవీ టీం. అందులో భాగంగానే జనవరి 4న ఏపీలో అత్యంత భారీ స్థాయిలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కి రామ్ చరణ్ బాబాయి, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా భారీ విజయం సాధించాలని రాష్ట్ర రాంచరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తున్న రామ్ చరణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్ర మైదానంలో డిసెంబర్ 29న మధ్యాహ్నం మూడు గంటలకి చిత్ర యూనిట్ ఆవిష్కరిస్తుంది. ఈ కార్యక్రమానికి మూవీ యూనిట్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా హాజరవుతారు.
అంతేకాదు ఆదివారం రోజు హెలికాప్టర్ తో రామ్ చరణ్ కటౌట్ కి పూలాభిషేకం చేయబోతున్నారు. 2000 కి పైగానే ఫ్యాన్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అభిప్రాయంతో పోలీసుల దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకున్నట్లు చరణ్ అభిమానులు వెల్లడించారు. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు.
తమిళనటుడు ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సముద్రఖని వంటి వారు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్, జి స్టూడియో బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్షన్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్స్, పాటలకే మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే.