అసంఘటిత రంగంలో అసోసియేన్లలో లేని కార్మికుల పరిస్థితేమిటి?
మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన సీసీసీ ఈ కష్టకాలంలో ఎందరో సినీకార్మికుల్ని ఆదుకుంది. ఇప్పటికే రెండు దఫాలుగా సినీకార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ సాగింది. ఇప్పుడు మూడోసారి నిత్యావసరాల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. సీసీసీ ద్వారా మరోసారి 12 వేల మంది కార్మికులకు సాయం అందించనున్నామని చిరు తెలిపారు.
మహమ్మారీ తీవ్రత తగ్గి తిరిగి షూటింగులు జరగాలని కోరుకుంటున్నానని.. ఈ కష్టకాలం ఇంకెంతో కాలం ఉండదని సంయమనం పాటించాలని చిరు పిలుపునిచ్చారు. ఇదివరకూ సీసీసీ సరుకుల పంపిణీ సాగినా.. లాక్ డౌన్ వల్ల కాస్త ఆలస్యంగా సరుకుల్ని అందించామని తెలిపారు. ఈసారి లాక్ డౌన్ లేదు కాబట్టి సినిమా అసోసియేషన్ల ద్వారా అందరికీ సరుకుల్ని సకాలంలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
అంతా బాగానే ఉంది కానీ .. 24 శాఖల సంఘాల సభ్యులకు మాత్రమే సీసీసీ సరుకులు పంపిణీ చేస్తుందా? సంఘాల్లో నమోదు కాని కార్మికుల పరిస్థితేమిటి? అంటే దీనికి సరైన సమాధానం లేదు. అయితే ఇంతకుముందు పలు అసోసియేషన్ల అభ్యర్థన మేరకు బయటివారికి కూడా సీసీసీ సాయం అందించింది. ఉపాధి లేక ఇబ్బందుల్లో ఉన్న టీఎంటీఏయు (తెలుగు మూవీ టీవీ ఆర్టిస్టులు)లో పరిమిత సంఖ్యలో సభ్యులకు సాయం అందించింది సీసీసీ. మూడు నెలలుగా కష్టాలు తప్పడం లేదు. మరోసారి ఈ తరహా సాయం ఇతరులకు చేస్తారా? చేయరా? అన్నది చూడాలి.