ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడానికంటే ముందే తెలుగు ఇండస్ట్రీ స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించింది. కేసులు ఎక్కువ అవుతున్నాయని గ్రహించి చిన్న, పెద్ద సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఆగిపోయాయి. స్టార్ హీరోలు అందరూ పెద్దగా ఆలోచించకుండా షూటింగ్ కు బై బై చెప్పేశారు. ఇప్పటికే షూటింగ్స్ ఆగిపోయి నెల రోజులు కావొస్తోంది. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఇంకో రెండు వారాలు కొనసాగవచ్చు. జూన్ మధ్యలోకి కేసుల సంఖ్య కూడ తగ్గే ఆస్కారం కనిపిస్తోంది.
అందుకే స్టార్ హీరోలు జూన్ మూడవ వారం నుండి షూటింగ్స్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. చాలా సినిమాలు చివరి దశ షూటింగ్ జరుపుకుంటే పూర్తైనట్టే. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఇంకో 10 రోజులు సెట్స్ మీద ఉంటే చాలు కంప్లీట్ అయినట్టే. అలాగే మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సైతం ఆఖరి దశలో ఉంది. బాలకృష్ణ నటుస్తున్న ‘అఖండ’, రవితేజ చేస్తున్న ‘ఖిలాడి’, అల్లు అర్జున్ ‘పుష్ప’ ఇంకొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నాయి. అందుకే జూన్ మూడవ వారంలో షూట్ స్టార్ట్ చేయాలనేది ఈ చిత్ర బృందాల ఆలోచన. ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, పవన్ కళ్యాణ్ రీమేక్ చిత్రం, హరిహర వీరమల్లు సగం పూర్తయి ఉన్నాయి. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే ఇవి కూడ వేగవంతం కానున్నాయి.