తాను క్షేమంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని అంటూ ప్రకటన చేసారు హీరో రాజశేఖర్. ఆయన తాజా చిత్రం ‘కల్కి’ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ గాయపడ్డారు. ఆ విషయం మీడియా ద్వారా బయిటకు వచ్చింది. దాంతో చాలా మంది ఆయనకు ఇండస్ట్రీవాళ్లు, ప్యాన్స్ ఫోన్ లు చేసి ఎలా ఉన్నారని అడుగుతున్నారు.
మరో ప్రక్క యూట్యూబ్ లో ఈ విషయం పెద్దది చేస్తూ ..రాజశేఖర్ కు సీరియస్ అంటూ వీడియోలు ప్రత్యక్ష్యమవుతున్నాయి. దాంతో వీటిన్నటికి చెక్ చెప్పటానికి ఆయన ఓ ప్రెస్‌నోట్ ద్వారా వెల్లడించారు. అయితే తన ఆరోగ్యం విషయం గురించి గుసగుసలు వినిపిస్తున్నాయని, దయచేసి ఇలాంటి రూమర్స్ సృష్టించవద్దని రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు.
ఆ ప్రెస్ నోట్ లో ఏముందంటే..
‘పది రోజుల క్రితం ఓ స్టంట్ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు గాయపడ్డాను. కానీ నేను విశ్రాంతి తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే సినిమాలో ఎందరో నటీనటులు ఉన్నారు. నా కారణంగా వారు సినిమా కోసం ఇచ్చిన డేట్స్‌ను మార్చుకోమని చెప్పలేను. ఇప్పుడు నేను కోలుకుంటున్నాను. ‘కల్కి’ సినిమా చిత్రీకరణ నిమిత్తం నా కుటుంబం, చిత్రబృందంతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌లోని కులు, మనాలీకి వెళ్లాను. మార్గమధ్యలో కొండచరియలు విరిగిపడ్డాయి.
దేవుడి దయ వల్ల ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాలేదు. అందమైన కులు మనాలి ప్రాంతంలో చిత్రీకరణ బాగా జరగాలని కోరుకుంటున్నాను. నా ఆరోగ్యం విషయం గురించి అభిమానులు, కుటుంబీకుల నుంచి విపరీతంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. నా ఆరోగ్యం గురించి ఇంతగా ఆరాతీస్తున్నందుకు ధన్యవాదాలు. ఇక నా ఆరోగ్యం గురించి ఎలాంటి వదంతులు సృష్టించొద్దు’ అని కోరారు.