అండర్ గ్రౌండ్ కు రవిప్రకాష్! సెల్‌ఫోన్ల స్విచ్ఛాఫ్‌

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ అజ్ఞాతవాసి గా మారారు. ఆయన ఎవరికీ కనపకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు సైబరాబాద్‌ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. టీవీ9కు సంబంధించిన పలు అంశాలు తెలుసుకునేందుకు సైబరాబాద్‌ ప్రత్యేక పోలీస్‌ టీమ్, సైబర్‌ క్రైమ్‌ అధికారులు శనివారం బంజారాహిల్స్‌లో రవిప్రకాష్ ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఉన్నవారిని వాకబుచేయగా.. బయటకు వెళ్లారని, ఎక్కడికి వెళుతున్నారో తమకు చెప్పలేదని వివరించారు.

రవిప్రకాష్ పోలీసుల విచారణకు సహకరిస్తారని, ఇందుకు పదిరోజుల గడువు కావాలని ఆయన న్యాయవాది పోలీస్‌ ఉన్నతాధికారులకు అభ్యర్థన పత్రం ఇచ్చారు. రవిప్రకాష్ ఎక్కడికి వెళ్లారని ఆయన సన్నిహితులు, కొంతమంది టీవీ9 ఉద్యోగులను ప్రశ్నించగా.. వారు కూడా తమకు ఏమీ చెప్పలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. రవిప్రకాష్ సెల్‌ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిర్ధారణకు వచ్చామన్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు.

మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు రెండోరోజూ విచారించారు. టీవీ9లో ఎవరు షేర్లు కొన్నారు? ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా? ఫోర్జరీ లేఖను ఎవరు తయారుచేశారు? అని ప్రశ్నించారు. ఇక విచారణకు హాజరుకాని నటుడు శివాజీకి మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. అప్పటికీ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.