ఒక అందాల హీరోయిన్.. ఒక డ్రగ్ మాఫియా డీలర్.. హైదరాబాద్ గచ్చిబౌళి రింగ్ రోడ్ పరిసరాల్లో ఒక ఖరీదైన భవంతిలో పక్క పక్క ఫ్లాట్ లో నివశించారు. ఆ ఇద్దరి మధ్యా బంధం డ్రగ్స్ షేరింగ్ తోనే అన్న వదంతులు వ్యాపించాయి. ఆ విషయాన్ని అప్పట్లో సిట్ దర్యాప్తు సైతం బయట పెట్టింది. అది కేవలం డ్రగ్స్ కొనుగోళ్ల వరకే పరిమితమైన స్నేహమా… ఇంకేదైనానా! అన్నది అటుంచితే.. ఆ స్నేహం వల్ల ఇండస్ట్రీలో బోలెడంత డ్రగ్ బిజినెస్ కి ఆస్కారం దొరికిందని సిట్ అధికారులు గుసగుసలాడారు.
ఇక ఈ కేసులో సదరు డ్రగ్ మాఫియా డాన్ ని సిట్ అధికారులు అరెస్టు చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వ జోక్యంతో ఆ కేసు ఏమైందో ఎవరికీ తెలీదు. సిట్ అంటూ హడావుడి చేసి మధ్యలోనే దానిని వదిలేయడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అన్నట్టు ఆ కేసు అలా అయ్యాక.. అతగాడు ఏమైనట్టు? అతడు హైదరాబాద్ కే చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పెళ్లాడాడని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసమని ప్రచారమైంది. అంతేకాదు.. తన భర్త పేరును పొరపాటున డ్రగ్ స్కామ్ లో ఇరికించారని అతడి భార్య ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. అదంతా ఏమో కానీ.. ప్రస్తుతం ఆ డ్రగ్ డాన్ గా ఆరోపణలు ఎదుర్కొన్న అతడి ఆచూకీ హైదరాబాద్ లో కనిపించడం లేదట. అంతేకాదు.. ఫేస్ బుక్.. ట్విట్టర్ వంటి వాటిలో అతడు గుట్టు చప్పుడు కాకుండా ఎంతో వ్యవహారం నడిపించేవాడు. కానీ ఇప్పుడు అవి కూడా మాయమయ్యాయి. ఇక ఇండస్ట్రీ స్నేహాలన్నీ అలా ఆన్ లైన్ లోనే సాగేవి పూర్తిగా కట్ అయ్యాయట. సిట్ వల్ల స్టార్ల పేర్లు బయటికి తెలిసినా కానీ టాలీవుడ్ పరువు పోతుందని వదిలేశారు. అయితే ఆ తర్వాత కొంతవరకూ డ్రగ్స్ కట్టడి అయ్యిందని వినిపించింది. ఇక ఇటీవల డ్రగ్స్ మాఫియా వ్యవహారాలేవీ బయట అల్లరవ్వలేదు. అంతా గుట్టు చప్పుడు కాకుండానే అన్న మాటా వినిపిస్తోంది. ఇక కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఖాళీగా ఉన్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి పాత విషయాల్ని నెమరు వేసుకుని ఔరౌరా! అంటూ ముక్కున వేలేసుకోవడం బయటపడింది.
