కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. కరోనాకు టాలీవుడ్ మినహాయింపు కాదు. ఇప్పటికే కొద్దిమంది నిర్మాతలు ఈ హీట్ ని తట్టుకోలేని పరిస్థితి. పరిశ్రమ సంక్షోభం గురించి అందరికీ తెలుసునని అగ్ర నిర్మాతలు అంటున్నారు. వ్యాపారం ఎప్పుడూ లాభదాయకంగా ఉండదు. ఒక్కోసారి నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. పరిశ్రమలు మనుగడ సాగించేలా నటీనటులు .. దర్శకులు తమ భారీ పారితోషికాల్ని తగ్గించుకుని.. బారీ బడ్జెట్లు అవ్వకుండా కాపాడాల్సి ఉంటుంది. గొప్ప కంటెంట్ ను ప్రోత్సహించి విజయాలు అందుకోవాలని నిర్మాతలు కోరుకుంటున్నారు. సదరు అగ్ర నిర్మాతల మాటలను స్టార్లు నటీనటులు వింటారని, లాక్‌డౌన్ సడలిన వెంటనే పరిశ్రమ పురోభివృద్ధికి కృషి చేస్తారని అంతా ఆశిస్తున్నారు.
ఇప్పుడు నిర్మాతలు తెలివిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న నటీమణులను పారితోషికంలో తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నటీమణుల బడ్జెట్ ను కోసేయాలన్న సరికొత్త ఆలోచనను నిర్మాతలు చేస్తున్నారట. ఎందుకంటే మారిన కాలానికి తగ్గట్టు నాయికలు డిస్కౌంట్లు ఇవ్వరు. అందుకే నిర్మాతలు సాధ్యమైనంత వరకూ వారి పారితోషికాలపైనే దృష్టి సారించే ఆలోచనలో ఉన్నారట. అయితే హీరోలు స్టార్ డైరెక్టర్లు పారితోషికాలు తగ్గించుకోకపోతే ఆ మేరకు నిర్మాతకు భారం అవ్వడం ఖాయం. కానీ ఆ ఇద్దరినీ మాత్రం మనోళ్లు టచ్ చేయరన్న విశ్లేషణ సాగుతోంది. కొత్తగా అవకాశాల కోసం ప్రయత్నించే నాయికలు పారితోషికాన్ని పట్టించుకోరు. ఇక ఇతర భామలను బతిమాలి కొంతవరకూ తగ్గించుకునే వీలుంటుందని అంచనా వేస్తున్నారు. అంటే ఎలాంటి పరిణామం ఉన్నా.. నష్టపోయేది కొందరే ఇక్కడ అని అర్థం చేసుకోవచ్చు.