బాలీవుడ్‌లో ముక్కుసూటిగా మాట్లాడే నటీమణుల్లో రవీనా టాండన్ ఒకరు. తను అగ్ర నటిగా ఉన్ననాటి సమయం.. అప్పటి రాజకీయాలు.. బాలీవుడ్ సంప్రదాయాలు.. ఇలా పలు విషయాలపై తాజాగా ఓ ఛానెల్లో మాట్లాడారు. ’90లలో నటీనటుల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది.
సెట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేది. హీరోహీరోయిన్ల నటన, అల్లర్లు వివాదాల గురించి చెప్పుకుంటూ ఒకర్నొకరు ఆట పట్టించుకునేవారు. అంతవరకైతే ఫర్వాలేదు. కొన్నిసార్లు ఇది శృతి మించి పోయేది. తమ కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉండేవాళ్లు, ఇతరుల విజయాన్ని ఓర్వలేకపోయేవాళ్లు కొందరు ఇతరుల్ని కిందికి లాగాలని ప్రయత్నించేవాళ్లు. దానికోసం వాళ్ల బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రయోగించేవాళ్లు. పరిశ్రమలో పోటీ ఉండటం సహజమే కానీ ఇదేం పద్ధతి? గాసిప్స్, అనవసర రాజకీయాలతో పాపులర్ కావాలనుకోవడం ఏంటి? కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి నేనూ ఎదుర్కొన్నా.
అయితే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఎవరితో ఇలా ప్రవర్తించలేదు. ఎవరి మనసూ గాయపరచలేదు. ఎవరినీ సినిమాలోంచి తీసేయించాలని ప్రయత్నించలేదు. నాకు తెలియకుండా అలా జరిగితే క్షమాపణ చెప్పడానికి ఇప్పటికీ సిద్ధమే’ అని చెప్పుకొచ్చారు.