అంత్య‌క్రియ‌ల‌కు హీరో భూదానం.. జ‌న‌సేనాని ప్ర‌శంస‌లు

ప్ర‌పంచ వ్యాప్తంగా కొవిడ్-19 తో మ‌ర‌ణాలు ఘోర‌క‌లిని త‌ల‌పిస్తున్నాయి. ఎక్క‌డి శ‌వాలు అక్క‌డే ప‌డి ఉంటున్నాయి. పూడ్చ‌టానికి… కాల్చ‌డానికి స్థ‌లాలు లేక‌పోవ‌డంతో చివ‌రికి ప‌బ్లిక్ ప్లేస్ లే శ్మ‌శాన వాటిక‌ల‌వుతున్నాయి. అవి కూడా నిండిపోవ‌డంతో చివ‌రికి తీసుకొచ్చి మ‌హా స‌ముద్రాల్లో క‌లిపేస్తున్నారు. ఇటీవ‌లే అలాంటి వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. అదృష్టం కొద్ది భారత్ లో ఇంకా అలాంటి ప‌రిస్థితులు త‌లెత్త‌లేదు. ఒక‌వేళ అలాంటి స్థితి వ‌స్తే అంత‌క‌న్నా దారుణంగా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు. తాజాగా క‌రోనా మృతుల‌కు కోసం త‌మిళ‌ న‌టుడు విజ‌య్ కాంత్ భూదానం చేసారు. ఇటీవ‌ల చెన్నైలోని క‌రోనా సోకిన ఓ న్యూరోస‌ర్జ‌న్ ను శ్మ‌శానంలోకి అనుమ‌తించ‌లేదు.

అక్క‌డితో ఆగ‌కుండా ఆ శ‌వాన్ని తీసుకొచ్చిన అంబులెన్స్ పై కూడా స్థానిక వాసులు దాడి చేసారు. ఈ విష‌యం విజ‌య్ కాంత్ కు తెలియ‌డంతో చ‌లించిపోయాడు. మ‌నుషులు ఇంత దారుణంగా మారిపోయారా? క‌రోనా క‌న్నా దారుణంగా మ‌నుషులు ఉన్నారు? అంటూ ఆగ్ర‌హం చెందాడు. ఈ నేప‌థ్యంలో చెన్నైలో త‌న‌కున్న ఖ‌రీదైన భూమిలో కొంత భాగాన్ని క‌రోనాతో చ‌నిపోయిన వారిని ఖ‌న‌నం చేయ‌డం కోసం కేటాయించారు. మృత దేహంతో క‌రోనా వ్యాప్తి చెంద‌దు. ఈ విష‌యం ప్ర‌జ‌లంతా తెలుసుకోవాలి. ఎవ‌రూ భూమ్మీద శాశ్వ‌తం కాదంటూ అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. ఇప్ప‌టివ‌ర‌కూ సెల‌బ్రిటీలు విరాళాలిచ్చారు. రోడ్ల మీద‌కు వ‌చ్చి ఆహారం లేని వాళ్ల‌కు ఆహార పోట్లాలాలు…నిత్యావ‌స‌ర స‌రుకులు వంటివి స్వ‌యంగా అందించారు. కానీ ఇలా క‌రోనా మ‌ర‌ణాల కోసం ఏకంగా భూమినే దానం చేసారంటే?… విజ‌య్ కాంత్ ఎంత గొప్ప వాడు అంటూ కోలీవుడ్ స‌హా టాలీవుడ్ మీడియా ఆయన్ని ప్ర‌శంసిస్తోంది. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ చెన్న‌య్ లోని త‌న ఇంటినే క‌రోనా వైద్యం కోసం కేటాయించ‌గా.. విజ‌య్ కాంత్ సైతం ఇంత గొప్ప సాయానికి ముందుకు రావ‌డంపై హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.

తెలుగు, త‌మిళ్ లో చాలా మంది స్టార్ హీరోలున్నారు. విజ‌య్ కాంత్ క‌న్నా చాలా మంది పెద్ద స్టార్లు ఉన్నారు. కానీ వాళ్లంతా విరాళాలు ఇచ్చి మ‌మ అనిపించారు. అవేర్ నెస్ వీడియోలు చేసారు. కానీ విజ‌య్ కాంత్ త‌ర‌హాలో స్పందించింది లేదు. అలాగే లాక్ డౌన్ ని చాలా మంది టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఓ హాలీడే స్పాట్ గా మార్చేసుకున్నారు. ర‌క‌ర‌కాల ఛాలెంజ్ లు విసురుతు ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఇది ఎంత హేయ‌మైనా చ‌ర్య అంటూ నెటిజ‌నులు త‌లంటేస్తున్నారు. ఇక విజ‌య్ కాంత్ ధాతృ హృద‌యంపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించారు. సూప‌ర్ స్టార్ .. ది గ్రేట్ తిరు విజ‌య్ కాంత్ త‌న కాలేజ్ ల్యాండ్స్ ని కొవిడ్ 19 మృతుల కోసం కేటాయించ‌డం త‌న గొప్ప మ‌న‌స్సుకు సాక్షాత్క‌రం అంటూ ప్ర‌శ‌సించారు.