పోస్టర్ పడనీయం.. సినిమాని ఆపేస్తాం !

కొన్ని సినిమాలు గురించి వింటూంటే కేవలం వివాదం కోసమే సినిమా నిర్మించారా ..అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే వివాదం కలిసొస్తే కాస్త టిక్కెట్లు తెగుతాయనే ఆశ అయ్యిండవచ్చు. ప్రీ పబ్లిసిటీ వస్తుంది మీడియాలో అనుకోవచ్చు. సర్కార్ వంటి సినిమాలకు అలాంటిది కలిసొస్తుందేమో కానీ చిన్న సినిమాకు ఎంతవరకూ ఈ వివాదం అనేది ముందుకు వెళ్తుంది అనేది డౌటే. కాకపోతే అసలు ఫలానా సినిమా ఉందనే విషయం మాత్రం ఇలాంటి వివాదాల వల్ల తెలిసివస్తుంది. ఇప్పుడు తనీష్ తాజా చిత్రం రంగుది అదే పరిస్దితి.

తనీశ్, పరుచూరి రవి, ప్రియా సింగ్, పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణమురళి, షఫీ ముఖ్య తారలుగా కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగు’. నల్లస్వామి సమర్పణలో యు అండ్‌ ఐ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఎ.పద్మనాభ రెడ్డి, నల్ల అయ్యన్న నాయుడు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది.

విజయవాడకు చెందిన లారా (పవన్‌ కుమార్‌) అనే వ్యక్తి జీవితం ఆధారంగా ‘రంగు’ సినిమా తెరకెక్కించారు. లారా కుటుంబ సభ్యుడైన దిలీప్, స్నేహితులు సందీప్, ధనుంజయ్‌ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేయటంలో వార్తలకి ఎక్కింది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి వార్త వెయ్యటానికి కూడా ఇష్టపడని మీడియా ..వివాదం రాగానే హెడ్ లైన్స్ లో ఈ సినిమాని చూపించేసింది. ఆ విషయాలు ప్రక్కన పెట్టి …

విజయవాడలో నివసించిన లారా అనే వ్యక్తి జీవితం ఆధారంగా నిర్మించిన ‘రంగు’ సినిమా పై అభ్యతరాలు ఉన్నాయని ‘లారా’ కుటుంబ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దిలీప్‌ (లారా బావ మరిది) మాట్లాడుతూ ఏమన్నారో చూద్దాం.

దిలీప్ (లారా బావ మరిది) : ఏడాది క్రితం లారా (పవన్ కుమార్) గురించి విజయవాడలో సమాచారం సేకరించడానికి చిత్ర దర్శకుడు కార్తికేయ వచ్చాడు. అప్పుడు మమ్మల్ని సంప్రదించలేదు. పది రోజుల క్రితం సినిమా ట్రైలర్, ప్రెస్ మీట్ చూసాము. లారా అనే రౌడీ షీటర్ అనే వాయిస్ తో ట్రైలర్ మొదలు అయ్యింది. లారా మీద రౌడీ షీట్ అన్యాయంగా తెరిచారు. ఇప్పుడు ఆయన పిల్లలు చదుకు కుంటున్నారు.

ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే వాళ్ళ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించండి. ఇప్పుడు ఆ సినిమా ముందు మాకు చూపించాలని డిమాండ్ చేస్తున్నాం. మా అంగీకారంతోనే సినిమా రిలీజ్ చేయాలి. లేదంటే సినిమా రిలీజ్ ని లీగల్ గా అడ్డుకుంటాం. విజయవాడలో పోస్టర్ కూడా పడనీయం. లారా గురించి వీరికి అసలు ఏం తెలుసు అని ప్రశ్నిస్తున్నాం ?

సందీప్ మాట్లాడుతూ ( లారా స్నేహితుడు ) : విజయవాడ అంటే సినిమా దర్శకులకు రౌడీ షీటర్స్ మాత్రమే గుర్తుకు వస్తారా ? లారా మీద సినిమా వస్తుంది అనగానే దర్సకుడి నెంబర్ తీసుకొని మాట్లాడాము. ఆయన చూద్దాం అని తర్వాత మా కాల్ కి రెస్పాన్స్ అవడం లేదు. వ్యక్తుల జీవితాల పై సినిమా చేసేటప్పుడు వారి కుటుంబం నుండి అనుమతి తీసుకోవాలి. నిర్మాత గాని, దర్శకుడు కానీ ఆ పని చేయలేదు. మేము ముందుగా సినిమా చూడాలి…మాకు అభ్యతరాలు ఉంటే సినిమాను ఆపేస్తాము.. మాకు సినిమా చూపించకుండా రిలీజ్ చేస్తే లీగల్ గా కోర్ట్ కి వెళతాం. ఇంకా ఎంత దూరం అయినా వెళతాం’. అన్నారు.