‘గజిని’, ‘యముడు’, ‘సింగం’ లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో.. సూర్య. ఆయన హీరోగా దర్శకుడు శ్రీరాఘవ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై రూపుదిద్దుకున్న చిత్రం ‘ఎన్.జి.కె (నంద గోపాల కృష్ణ)’. ఎన్జీకే సినిమా ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన సూర్య ..ఈ కార్యక్రమంలో ‘వైఎస్ జగన్ మీకు చాలా క్లోజ్ కదా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ జగన్ తో తనుకున్న అనుబంధం గుర్తు చేసుకున్నారు. తామిద్దరం కలిస్తే ఐస్ క్రీమ్స్ తింటామని చెప్పుకొచ్చాడు.
సూర్య మాట్లాడుతూ..‘‘నేనెప్పుడూ ఆయన్ని జగన్ అన్నా అని పిలుస్తాను. జగన్ కజిన్ అనిల్ రెడ్డి నా క్లాస్‌మేట్. జగన్ ఎప్పుడు చెన్నై వచ్చినా మేమిద్దరం కలిసి ఐస్ క్రీమ్స్ తింటాం. మా ఇద్దరికీ కామన్ ఎంటర్ టైన్ మెంట్ అదే. 4-5 ఐస్ క్రీమ్స్ తినేసి మళ్లీ వెనక్కి వచ్చేస్తాం.” అన్నారు.
అలాగే పది సంవత్సరాల క్రితం వారి కుటుంబానికి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత జగనన్న ఇంత పెద్ద విజయాన్ని సాధించడం మామూలు విషయం కాదు. ప్రజలందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన సెకండ్ యంగెస్ట్ సీయం. ప్రజలు కోరుకునే మార్పును ఆయన ద్వారా సాధిస్తారని అనుకుంటున్నాను. జగన్ ఒక సక్సెస్‌ఫుల్ పొలిటీషియన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు.
‘ఎన్.జి.కె (నంద గోపాల కృష్ణ)’సినిమా విషయానికి వస్తే..ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ‘ఏమైంది ఈవేళ, అధినేత, బెంగాల్ టైగర్’ వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ అందిస్తున్నారు. ఈ చిత్రం మే 31 న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా హీరో సూర్య మీడియాతో ముచ్చటించారు.