యంగ్ హీరో కేసులో మరో ట్విస్టు
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలు వీడియో ఆధారాల్ని పోలీసులు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంతలోనే కార్తీక్ అనే ఓ వ్యక్తి ఈ కేసుకు సంబంధించి నార్సింగి వద్ద (హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ) ఓ వీడియో ఆధారంతో పోలీసుల్ని సంప్రదించడం మలుపు తిప్పింది. ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేసిన రాజ్ తరుణ్ కార్ యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. అయితే ఆ వీడియోని బయట పెట్టొద్దంటూ తనకు అతడి మేనేజర్ రాజా రవీంద్ర 5లక్షలు ఆశ చూపారని అతడు వెల్లడించడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది.
మేనేజర్ రాజా రవీంద్ర వివరణ
వీటన్నిటిపైనా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు సాగుతోంది. నిజనిర్ధారణ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈలోగానే రాజ్ తరుణ్ మేనేజర్ రాజా రవీంద్రను మీడియా వివరణ కోరగా అతడు ఇచ్చిన సమాధానం పూర్తిగా రివర్స్ గేర్ లో ఉండడడం ఆశ్చర్యపరుస్తోంది. అసలు అతడెవరో తనకు తెలియదని.. అతడే వీడియో రికార్డింగులు చేసి డబ్బు డిమాండ్ చేశాడని ఇదంతా ప్రీప్లాన్డ్ గా చేశాడని రాజా రవీంద్ర ఆరోపిస్తున్నారు. అక్కడేదీ మర్డర్ జరగలేదు. జరిగినట్టు హడావుడి జరిగింది. రాజ్ తరుణ్ అక్కడి నుంచి పారిపోయిన మాట నిజమే అయినా ఏదీ జరగలేదు. ఆరోపణలన్నీ అవాస్తవాలు అంటూ ఖండించే ప్రయత్నం చేశారు. ప్లాన్ చేసి ఆ వ్యక్తి 5లక్షలు డిమాండ్ చేశాడని అంత పెద్ద మొత్తం లేదని 3లక్షలు ఇచ్చేందుకు అంగీకరించామని రాజా రవీంద్ర అంటున్నారు. మరి ఈ కేసులో నిజాలేంటో తేలాల్సి ఉంది.