జిఎస్టీ అధికారులపై మహేష్ బాబు సీరియస్

సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని ఆరోపిస్తూ జిఎస్టీ అధికారులు తన బ్యాంకు ఖతాలు సీజ్ చేయడం పట్ల సినీ హీరో మహేష్ బాబు సీరియస్ అయ్యారు. బ్యాంకు ఖతాలు సీజ్ చేసిన జిఎస్టీ కమిషనర్ కు మహేష్ బాబు లీగల్ నోటీసులు జారీ చేశారు. 

కనీసం నోటీసులు ఇవ్వకుండా తన బ్యాంకు ఖాతాలు నిలిపిివేయడం సరికాదన్నారు. తాను ట్యాక్స్ లు అన్నీ సక్రమంగానే చెల్లిస్తున్నానని మహేష్ బాబు ప్రకటించారు. కోర్టు పరిధిలో ఉన్న అకౌంట్లను ఎలా ఫ్రీజ్ చేస్తారని ప్రశ్నించారు మహేష్ బాబు. 

చట్టాలను గౌరవించి, చట్టానికి కట్టుబడి ఉండే భారతీయ పౌరుడిని అని మహేష్ బాబు తెలిపారు. అయినా జిఎస్టీ అధికారులు ఉద్దేశపూర్వకంగా తనకు నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మహేష్ బాబు.

హైదరాబాద్ జిఎస్టీ కమిషనరేట్ అధికారులు గురువారం హీరో మహేష్ బాబు బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. 2007, 2008 సంవత్సరాలలో బ్రాండ్ అంబాసిడర్ గా, యాడ్స్ ద్వారా రెవెన్యూ పొందిన మహేష్ బాబు సర్వీస్ టాక్స్ పే చేయకుండా ఎగ్గొట్టినట్లు జిఎస్టీ కమిషనరేట్ ఒక ప్రకటనలో తెలిపింది.

73.5 లక్షల కోసం మహేష్ బాబు కు చెందిన ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంకు అకౌంట్లను బ్లాక్ చేశారు అధికారులు. మహేష్ బాబు చెల్లించాల్సిన మొత్తం 18.5 లక్షలు. కానీ దానికి సంబంధించి ఫెనాల్టీ, వడ్డీ కలిపి 73.5 లక్షలకు బ్యాంకు ఖాతాలు నిలుపుదల చేసినట్లు కమిషనరేట్ తెలిపింది.

2007,2008 సమయంలో 17 లక్షల సర్వీసు ట్యాక్స్ చెల్లించాలని జిఎస్టీ అధికారులు అంటున్నారు. అప్పుడు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. అయితే ఆ విషయం వివాదమై కోర్టులో కేసు నడుస్తున్నది. కోర్టులో ఉన్న కేసులో బ్యాంకు అకౌంట్లను ఎలా సీజ్ చేస్తారన్నది మహేష్ బాబు వాదన. 

మరి మహేష్ బాబు లీగల్ నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయే చాన్స్ ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

మహేష్ బాబు బ్యాంకు ఖాతాలు నిలపుదల చేసే నోటిఫికేషన్ కింద ఉంది చూడండి.