తెలంగాణ- ఏపీ డివైడ్ తర్వాత టాలీవుడ్ వైజాగ్ కి తరలి వెళ్లిపోతుందని అంతా భావించారు. కానీ సీన్ మాత్రం ఎక్కడ గొంగలి అక్కడే! అన్న చందంగా మారింది. ఇప్పటికీ తెలంగాణ వాదులు ఆంధ్రా సినిమా వాళ్ల ఆధిపత్యాన్ని ఓ పట్టాన హర్షించలేని సన్నివేశం ఉంది. సీన్ సీరియస్ అయిన ప్రతిసారీ ఏదో ఒకటి తెరపైకి తెచ్చి తెలంగాణ వాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఆంధ్రోళ్లపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఛీ కొట్టినా ఆంధ్రోళ్లు ఇట్నుంచి అటు పోరు! అన్న చిన్న చూపు అలానే ఉంది. పాలనాధీశులైన కేసీఆర్ – కేటీఆర్ టాలీవుడ్ ని ఎటూ పోకుండా పట్టుకోవాలని చూస్తుండడం వల్ల.. చొరవ చూపడం వల్ల మాత్రమే ఇండస్ట్రీ ఇంకా హైదరాబాద్ లో ఉండగలిగింది అన్నది బహిరంగ రహస్యం.
ఓవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఓ కొలిక్కి రాకపోవడం కూడా హైదరాబాద్ నుంచి టాలీవుడ్ తరలి వెళ్లకపోవడానికి కారణంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. రాజధాని అంశం ఎటూ తేలని సందిగ్ధంలో ఉండడమే ప్రధాన కారణం. టాలీవుడ్ అనే గ్లామర్ ఏపీకి ఎంతో అవసరం. కానీ దాని గురించి ప్రత్యేకించి మాట్లాడే పరిస్థితి ఇప్పటికి కనిపించడం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి- మంత్రి అవంతి శ్రీనివాసరావు వైజాగ్ లో టాలీవుడ్ ఏర్పాటు చేయడంపై ఆసక్తి చూపిస్తుండడం అటుపై మెగాస్టార్ చిరంజీవితో ఈ విషయమై మంతనాలు సాగించడంతో మరోసారి వైజాగ్ టాలీవుడ్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. పరిశ్రమను హైదరాబాద్ నుంచి విశాఖకు తరలిస్తారా? అన్న దానిపై ఇండస్ట్రీ ఇన్ సైడ్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. 24 శాఖల కార్మికులు సహా ఆర్టిస్టులు టెక్నీషియన్లలోనూ దీనిపై ముచ్చట సాగుతోంది.
అదంతా సరే కానీ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఏపీ ఫిలిండెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) ఓ ప్రకటన చేసింది. చెన్నయ్ కి చెందిన ఏవీఎం స్టూడియో.. సినీహీరో బాలకృష్ణ వైజాగ్ లో ఫిలిం స్టూడియోల నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారని అందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉందని ప్రకటించింది. అయితే ఆ తర్వాత తేదేపా ఓడిపోయి వైయస్ జగన్ సీఎం అవ్వడంతో సీన్ మొత్తం రివర్సయ్యింది. అయితే ఇప్పుడు వైజాగ్ టాలీవుడ్ అభివృద్ధి కోసం జగన్ ఆలోచిస్తున్నారు కాబట్టి బాలయ్యకు కానీ.. ఏవీఎం వాళ్లకు కానీ స్టూడియోల నిర్మాణానికి అనుమతులిస్తారా? లేక మెగా ఫిలింస్టూడియో నిర్మాణానికి ఆయన సాయం చేస్తున్నారా? అసలేం జరుగుతోంది? వైజాగ్ టాలీవుడ్ పురుడు పోసుకోనుందా లేదా? అన్న ఆసక్తికర చర్చ మరోసారి ఇండస్ట్రీ వర్గాల్ని వేడెక్కిస్తోంది. ఈనెల 9న ఏపీ సీఎం వైయస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీప్రముఖులు భేటీ అయ్యి ఇండస్ట్రీ సమస్యలపై ముచ్చటించనున్నారు. పనిలో పనిగా వైజాగ్ టాలీవుడ్ పైనా సీరియస్ గా దృష్టి సారిస్తారన్న చర్చ కూడా సాగుతోంది.