సూపర్ స్టార్ మహేష్ అందం గురించి వర్ణించడం ఎవరికి సాధ్యం. మహేష్ అభిమాని కాని హీరోయిన్ ఎవరు? ఆయన అందాన్ని ఇష్టపడని నాయిక ఎవరు? ఆయనతో కలిసి పనిచేయాలని ఏ హీరోయిన్ కోరుకోదు? ఆ విషయంలో బాలీవుడ్ భామలే దిగొస్తారు మహేష్ కోసం. అవును ఓ సందర్భంలో దీపికా పదుకొణె సైతం ఇదే మాట అంది. మహేష్ తో ఒక్కసారైనా కలిసి నటించాలని ఉందని తాపత్రయపడింది. అవకాశం వచ్చినా కోల్పోవాల్సి వచ్చిందని వాపోయిందటే అతిశయోక్తి కాదు. మరి నేడు ఆ సూపర్ స్టార్ పుట్టిన రోజు. 44 పూర్తి చేసుకుని 45వ పడిలోకి అడుగుపెట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అంతా శుభాకాంక్షలతో మోతెక్కిస్తున్నారు.
హీరోలు, హీరోయిన్లు, దర్శక, నిర్మాతలు..ఆయన అభిమానులు అందరూ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి పనిచేసిన హీరోయిన్లంతా కూడా ప్రత్యేకంగా విషెస్ తెలియజేసారు. ఇందులో కొంత మంది భామలు ఏకంగా మహేష్ నామ జాపం చేసారు. రకుల్ ప్రీత్ సింగ్, త్రిష, సమంత, కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే, కియారా అద్వాణీ, కృతి సనన్, ఇలియానా, పార్వతి మెల్టన్, భూమిక, అంజలి శుభాకాంక్షలతో ముంచెత్తారు. మహేష్ తో తమ అనుబంధాన్ని, ఆన్ సెట్స్ లో అనుభవాన్ని పంచుకున్నారు. మహేష్ ఇంతా..అంతా అంటూ ఆకాశానికి ఎత్తేసారు. అయితే వీళ్లందరిలో కామన్ గా కనిపించిన పాయింట్ ఒక్కటే. అదే మహేష్ గ్లామర్.
ఆయన అందాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ తమ అనుభూతుల్ని పంచుకున్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా అంతా ఇళ్లకే పరిమితమ వ్వడంతో కాస్త ఎక్కువ విషెస్ అందినట్లు అనిపిస్తోంది. టాలీవుడ్ హీరోలు బర్త్ డేలు సెలబ్రేట్ చేసుకున్నా? చేసుకోక పోయినా! సోషల్ మీడియాలో అభిమానులు..ఇతరులు సెలబ్రేట్ చేయడం అన్నది టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సహజంగా జరిగిపోతుంది. వాట్సాప్, ట్విటర్, ఫేస్ బుక్ ఇలా ఏ మాధ్యమాన్ని వదలకుండా విషెస్ తో దాడి చేస్తున్నారు. మహేష్ విషయంలోనూ అదే జరిగింది. ప్రతీ ఏడాది మహేష్ బర్త్ డే చేసుకుంటున్నాడు. కానీ ఈసారి స్పందనలు ఊహించని విధంగా వచ్చాయి. మహేష్ తో పదేళ్ల క్రితం సినిమాలు చేసిన భూమిక, ఇలియానా, పార్వతి మెల్టన్ లాంటి వారు స్పెషల్ విషెస్ సెంట్రాఫ్ ది అట్రాక్షన్ గా నిలిచాయి. అంతా కరోనా మాయ.