సందీప్ కిషన్‌కు హైదరాబాద్ మెట్రో షాక్!

సందీప్ కిషన్‌కు హైదరాబాద్ మెట్రో షాక్!

గత కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న సందీప్ కిషన్.. ప్రస్తుతం కార్తీక్ రాజు దర్శకత్వంలో ‘నిను వీడని నీడను నేనే’ సినిమా చేసాడు. హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ రోజు (జూలై12న) విడుదల అయిన ఈ సినిమాకు తాజాగా హైదరాబాద్ మెట్రో అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే..సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సందీప్‌ నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలూ చూసుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ నగరంలోని పలు చోట్ల పోస్టర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో మెట్రో స్తంభాల వద్ద ప్రచార పోస్టర్లను అతికించారు. అయితే, ఈ పోస్టర్లను జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారు.

ఈ పోస్టర్స్ చూడటానికి అసభ్యకరంగా ఉన్నాయంటూ .. ఉప్పల్ కు చెందిన కొంత మంది ప్రయాణికులు ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ వాళ్ల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు సదరు పోస్టర్స్ చూసి వెంటనే వాళ్ల పై అధికారులకు కంప్లైట్ చేసారు. దీంతో సదరు అధికారులు.. ఈ పోస్టర్స్ చూసి వెంటనే తొలిగించాలని ఆదేశించారు. దీంతో జీహెచ్‌ఎంసీ స్థానిక పోలీసుల సహకారంతో మెట్రో పిల్లర్ల వెంట ఉన్న ఈ సినిమా పోస్టర్స్‌ను తొలిగించారు.

అధికారుల తీరుపై చిత్రయూనిట్ అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌ కోసం అధికారుల అనుమతి తీసుకున్నామని.. అయినప్పటికీ పోస్టర్లు తొలగించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.