షాక్‌: ప్ర‌యివేటు చానెళ్ల‌కు దూర‌ద‌ర్శ‌న్ చెక్

మీడియా చానెళ్ల మ‌ధ్య నువ్వా నేనా? అంటూ సాగే హోరాహోరీ గురించి తెలిసిందే. ప్రయివేటు ఛానెళ్ల రాక‌తో సాంప్ర‌దాయ‌క‌ దూర‌ద‌ర్శ‌న్ అట్ట‌డుగుకు వెళ్లిపోయింది. అయితే క‌రోనా పాఠాల్లో ఇప్పుడు ప్ర‌యివేటు చానెళ్ల‌కు ధీటుగా దూర‌ద‌ర్శ‌న్ టీఆర్పీలో పైకి రావ‌డం షాక్ కి గురి చేస్తోంది. ఇదెలా సాధ్యం? అంటే.. ప్ర‌యివేటు చానెళ్లు ఎంత చించుకున్నా దేశంలో ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించ‌డంలో దూరదర్శన్ ఎత్తుగ‌డ స‌ఫ‌ల‌మైంద‌ని తెలుస్తోంది. ఏప్రిల్ 3న ముగిసిన వారాంతానికి బార్క్ విడుదల చేసిన వ్యూయర్ షిప్ రిపోర్టులో ఈ విషయం స్పష్టమైంది. దూరదర్శన్ ఈ సమయంలో దాదాపు 40,000 శాతం వ్యూయర్ షిప్ పెంచుకుంది. దీనికి ముఖ్యంగా రామాయణం పునః ప్రసారం చేయడమే కారణమ‌ని తెలుస్తోంది.

ఏఎం పీఎం అనే తేడా లేకుండా రెండు సార్లు దూరదర్శన్ తన వీక్షకుల కోసం రామాయణం పునః ప్రసారం చేసి విపరీతంగా పెంచుకుంది. లాక్ డౌన్ సమయంలో వ్యూయర్ షిప్ పెంచుకుందామని ఆశపడ్డ ప్రయివేటు న్యూస్ చానెళ్లు.. ఎంటర్ టైన్ మెంట్ ఛానెళ్ల ఆశలపై ఈ విధంగా దూరదర్శన్ నీళ్లు చల్లింది. రామాయణం.. మహాభారతం టెలికాస్టు చేయడం ద్వారా దూరదర్శన్ లాక్ డౌన్ సమయంలో హీరోగా నిలిచింది. అయితే ఇటీవ‌లి కాలంలో జ‌నం క‌రోనా భ‌యంతోనో చావు భ‌యంతోనో తిరిగి ఇంటిప‌ట్టునే ఉంటూ ఇలా ప‌ద్ధ‌తిగా పురాణేతిహాసాలు చ‌దువుకోవ‌డం లేదా టీవీ చానెళ్ల‌లో వీక్షించ‌డం ద్వారా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఇది క‌రోనా టిప్ అని భావించాల్సి ఉంటుంది