30 లక్షలకే కాజల్ ఒప్పేసుకుందా?
పుష్కర కాలంగా టాలీవుడ్ తో పాటు దక్షిణాదిన సత్తా చాటింది కాజల్ అగర్వాల్. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన కాజల్ క్రేజ్ ప్రస్తుతం దారుణంగా పడిపోయినట్టు తెలుస్తోంది. ఒక దశలో క్రేజీ కథానాయికగా భారీ స్థాయిలో పారితోషికాన్ని వసూలు చేసిన కాజల్ పరిస్థితి ఇటీవల చేసిన సినిమాలు దారుణంగా ఫ్లాప్ కావడంతో తారుమారైందన్న చర్చ సాగుతోంది. సెంటిమెంటును నమ్మే పరిశ్రమలో సక్సెస్ రాకపోతే ఎలా ఉంటుందో కాజల్ ని చూస్తే తెలిసిపోతుందని ముచ్చటించుకుంటున్నారు.
వరుస ఫ్లాపులు ఈ అమ్మడికి చిక్కులు తెచ్చాయట. తనని తెలుగు తెరకు పరిచయం చేసిన గురువు తేజ దర్శకత్వంలో నటించిన `సీత`.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రెండవ సారి కలిసి నటించిన `కవచం`.. శర్వానంద్‌తో చేసిన `రణరంగం` ఆశించిన విజయాల్ని ఇవ్వకపోవడం కాజల్ పరిస్థితిని తలకిందులు చేసిందిట.
దీనికితోడు రమేష్ అరవింద్ రూపొందించిన `క్వీన్` రీమేక్ సెన్సార్ చిక్కుల్లో పడటం, దాంట్లో కాజల్‌పై చిత్రీకరించిన సన్నివేశాలు మరీ వల్గర్‌గా ఉండటంతో కాజల్ గ్రాఫ్ క్రమంగా పడిపోయిందని చెబుతున్నారు. దీంతో ఆమె పారితోషికాన్ని భారీగా తగ్గించుకుందని తెలిసింది. కాజల్ తాజాగా విష్ణు నటిస్తున్న ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. విష్ణుకు చెల్లెలిగా కాజల్ కనిపించనుంది. దీనితో పాటు బాలీవుడ్‌లో `ముంబై సాగా` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కాజల్ ఆశ్చర్యపడే స్థాయిలో పారితోషికాన్ని తీసుకుందని తెలిసింది. ఈ సినిమాకు ఆమె అందుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా 30 లక్షలు మాత్రమే. టాలీవుడ్‌లో ఏకంగా 1.75 కోట్లు డిమాండ్ చేసే కాజల్ బాలీవుడ్ చిత్రానికి కేవలం 30 లక్షలు మాత్రమే తీసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.