మహిళా దర్శకురాలు అనుమానాస్పద మృతి

మలయాళ యువ దర్శకురాలు నయన సూర్యన్‌(28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం సంచలనంగా మారింది. ఆదివారం రాత్రి ఆమె తన ఫ్లాట్‌లో శవమై కనిపించారని పోలీసులు తెలిపారు. ఆమెది ఆత్మహత్యా లేక సహజ మరణమా లేక వేరే ఏమన్నా సంఘటన లు ఈ విషయంలో చోటు చేసుకున్నాయా అనేవి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు.

వివరాలుల్లోకి వెళితే… కేరళలోని అలప్పాడ్‌కు చెందిన నయన సూర్యన్ .. సినిమా రంగంపై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. లెనిన్‌ రాజేంద్రన్‌, కమల్‌, జీతూ జోసెఫ్‌, డాక్టర్‌ బిజు తదితర ప్రముఖ మలయాళ దర్శకుల వద్ద అసోసియేట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. రెండేళ్ల క్రితం ‘క్రాస్‌వర్డ్‌’ అనే సినిమా ద్వారా దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చారు.

పోలీస్ లు చెప్పిన వివరాలు ప్రకారం.. ఆదివారం తన కూతురు ఫోన్‌ ఎత్తకపోవడంతో నయన తల్లి.. ఆమె స్నేహితులకి ఫోన్‌ చేశారు. ఈ క్రమంలో వారు తిరువనంతపురంలోకి నయన ఫ్లాట్‌లోకి వెళ్లి చూడగా.. ఆమె ప్రాణాలతో లేరు. ఈ విషయం గురించి ఆమె స్నేహితురాలు ఒకరు మాట్లాడుతూ… నయన గత కొంతకాలంగా డయాబెటిస్‌తో బాధ పడుతున్నట్లు తెలిపారు.

అలాగే దర్శకత్వంలో తనకు మెళకువలు నేర్పిన డైరెక్టర్‌ లెనిన్‌ రాజేంద్రన్‌ ఆకస్మిక మృతి(జనవరి 14న)ని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కాగా పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే నిజానిజాలు బయటపడతాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసును లోతుగా విచారిస్తున్నామని.. త్వరలోనే ఆమె మృతికి గల కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.