బన్ని ఒప్పేసుకుంటాడా…ఫ్యాన్స్ కు పిచ్చ టెన్షన్

తమ అభిమాన హీరో ఫలానా చిత్రం రీమేక్ చేస్తున్నాడని తెలియగానే ఫ్యాన్స్ ఎలర్ట్ అయ్యిపోతారు. అసలు ఆ సినిమాని ఎలాగైనా పట్టుకుని చూసేస్తారు. ఆ తర్వాత తమ హీరో ఆ సినిమాకు సూట్ అవుతాడో లేదో అంచనా వేస్తారు. ఆ కథను తెలుగులోకి ఏ మార్పులు చేస్తారో చర్చలు చేస్తారు. ఆ సినిమా తమ హీరోకు సెట్ కాదనుకుంటే ఆ విషయం చెప్తూ లెటర్స్ రాస్తారు. కొందరు అభిమానులు అయితే వెళ్లి హీరోని కలిసి కూడా చెప్తూండటం జరుగుతూంటుంది. ఇలా పెద్ద ప్రాసెస్ నడుస్తూంటుంది. ఇప్పుడు అలాంటిదే బన్ని అభిమానులు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ’96’ సినిమా పెద్ద హిట్. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో వింతకూడా ఏమీ లేదు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. అయితే దిల్ రాజుకు ఈ చిత్రంకు హీరో ఎవరని ఎంచుకోవాలనే విషయం దగ్గరే సమస్య వచ్చింది. మొదట ఈ రీమేక్ కోసం నాని, శర్వానంద్ లను అనుకున్నారు. కానీ ప్రాజెక్టుకు క్రేజ్ రావాలంటే స్టార్ హీరో అయితే బెస్ట్ అని..అల్లు అర్జున్ తో ప్రపోజల్స్ పెట్టడం మొదలెట్టారట. మొదట హీరో అల్లు అర్జున్ ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన అబిమానులు మాత్రం వద్దంటున్నట్లు సమాచారం.

96 సినిమాలో హీరో ఏజెడ్ పర్శన్ గా కనిపిస్తాడని, మాస్ ఎలిమెంట్స్ అనేవి మచ్చుకు కూడా కనపడవని అంటున్నారట. అయితే ఇలాంటి కథలు చేస్తే మళయాళం వాళ్ళకు బాగా నచ్చుతుంది. అక్కడ మార్కెట్ రెట్టింపు అవుతుంది. ఇన్నాళ్లు కేరళ యూత్ లో బన్నికి క్రేజ్ ఉంది. ఈ సినిమాతో ఫ్యామిల్లోకి కూడా వెళ్లచ్చు అని చెప్పి దిల్ రాజు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే తమ హీరో ఎక్కడ ఒప్పుకుని ఆ డీ గ్లామర్ సినిమా చేస్తాడో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారట.