దేవరకొండ- మైత్రి ఊహించని సర్ ప్రైజ్
ఇది ఊహించనిదే అయినా పక్కాగా నిజం. ఆస్కార్ 2020 రేసుకి విదేశీ కేటగిరీలో ఇండియన్ సినిమాల జాబితా ప్రిపేరైంది. అందులో తెలుగు సినిమా `డియర్ కామ్రేడ్` పేరు వినిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కించుకోలేదు. బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఈ సినిమాని విదేశీ కేటగిరీలో ఆస్కార్ బరికి పోటీకి పంపడం రౌడీ ఫ్యాన్స్‌లో ఉత్కంఠ పెంచుతోంది. అద్భుతమైన ప్రేమకథ.. ఎమోషన్ ఉన్న సినిమాగా డియర్ కామ్రేడ్ కి ఈ అర్హత ఉందని టీమ్ భావించి రేసులోకి దించిందని తెలుస్తోంది. విదేశీ కేటగిరీలో టాలీవుడ్ తరపు నుంచి బరిలో దిగిన ఏకైక సినిమా ఇదే కావడం ఆసక్తికరం.
ఠఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాలి
ఆస్కార్ ఎంట్రీలో ఫిలింఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్.ఎఫ్.ఐ) ప్రకటించిన 28 సినిమాల జాబితాలో డియర్ కామ్రేడ్ స్థానం సంపాదించుకుంది. హిట్టు ప్లాపుతో సంబంధం లేకుండా ఈ చిత్రాన్ని నమ్మి ఆస్కార్ విదేశీ కేటగిరీకి పంపడం ఆసక్తికరమే. దీంతో పాటుగా బాలీవుడ్ చిత్రాలు అంధాధున్, యూరి: ది సర్జికల్ స్ట్రైక్, బదాయి హో, గల్లీ బోయ్ బరిలో నిలిచాయి. ప్రతిసారీ ఫిబ్రవరిలో ఆస్కార్ పురస్కారాల్ని ప్రకటించడం ఆనవాయితీ. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అవార్డులు ఇచ్చే ముందే.. భారతదేశం నుంచి ఏ సినిమా రేసులో ఉందో తేల్తుందన్నమాట. దేవరకొండ- మైత్రి టీమ్ ప్రయత్నం ఫలిస్తుందా అంటే.. అక్కడ పోటీ తీవ్రంగానే ఉంది కాబట్టి వేచి చూడాలి