విజయ్ దేవరకొండ.. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి చెప్పి సరికొత్త ప్రమోషన్లు, స్ట్రాటజీలతో తనను తాను ప్రేక్షకులకు దగ్గర చేసుకున్నారు. ఆ భిన్నత్వమే అతి తక్కువ కాలంలో అతనికి మాంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఒక వర్గంలో ఎంత నెగెటివిటీ ఉన్నా ఇంకో వర్గంలో మాత్రం విజయ్ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఫ్లాప్ సినిమాలు పడినా ఆయన డిమాండ్ మాత్రం తగ్గట్లేదు. నిజానికి దేవరకొండకు ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. ఎమోషనల్ గా వారికి ఎలా దగ్గరవ్వాలో తెలుసు. అందుకే వీలు చిక్కినప్పుడల్లా టాలెంట్ చూపిస్తుంటారు.
తాజాగా ‘జాతిరత్నాలు’ సినిమా వేడుక వరంగల్ నందు జరిగింది. ఈ వేడుకకు విజయ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. విజయ్ వస్తున్నదని తెలియగానే భారీ సంఖ్యలో అభిమానులు వేడుకకు హాజరయ్యారు. కోవిడ్ భయాన్ని సైతం లెక్కచేయకుండా మైదానంలో కిక్కిరిసిపోయారు. వాళ్ళను చూసిన విజయ్ మాటల చమత్కారం అందుకున్నారు. ఏకంగా వాళ్ళను జాతీయ స్థాయికి ఎత్తేశారు. లాక్ డౌన్ తర్వాత ప్రేక్షకులు సినిమా హాళ్లకు వస్తారా రారా అని భయపడేవాళ్లమని కానీ మిమ్మల్ని చూశాఖ ఆ భయం పోయిందని, బాలీవుడ్లో మీ గురించే మాట్లాడుకుంటున్నారని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చేశారు.
ఇలాంటి ప్రేక్షకులు దేశంలో ఎక్కడా ఉండరని, సినిమాలను తెలుగు వాళ్ళు ప్రేమించినంతగా ఎవ్వరూ ప్రేమించారని, సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో అన్నా, సినిమా వేడుకలన్నా వేల సంఖ్యలో వస్తారని, ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా అని మునగ చెట్టు ఎక్కించేశారు. విజయ్ మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరోసారి విజయ్ ప్రేక్షకుల్ని తన మాటల్తో ఫ్లాట్ చేసేశారని అనుకుంటున్నారు.